Telangana High Court: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం. సోషల్ మీడియా వచ్చాక ఇవి హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలపై నేతలపై వ్యక్తిగత విమర్శలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. వ్యక్తిత్వాన్ని హననం చేయడం, గాయపర్చడం, పరువు నష్టం కలిగించేలా ఉంటున్నాయి. దీంతో అధికారంలో ఉన్న పార్టీలు విమర్శలు చేసే విపక్ష నేతలపై కేసులు పెడుతున్నాయి. అయితే తెలంగాణ హైకోర్టు ఇటీవల రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఒక ముఖ్యమైన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు భావ ప్రకటనా స్వేచ్ఛ, నేరపరమైన చర్యల మధ్య సమతుల్యతను నొక్కిచెప్పింది. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్‌పై నమోదైన మూడు కేసులను కొట్టివేస్తూ, రాజకీయ విమర్శలను రాజ్యాంగ హక్కుగా గుర్తించింది.
Also Read: ‘మిరాయి’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా?ఫట్టా?
రాజకీయ విమర్శలకు రాజ్యాంగ రక్షణ
తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఎన్.తుకారంజీ, నల్లబాలు శశిధర్ గౌడ్‌పై రామగుండం, కరీంనగర్, గోదావరిఖని –1 టౌన్ పోలీసు స్టేషన్లలో నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేశారు. ఈ కేసులు, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై శశిధర్ గౌడ్ చేసిన సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా నమోదయ్యాయి. ఈ పోస్టులలో, ‘కాంగ్రెస్ రాష్ట్రానికి తెగులు‘, ‘నో విజన్, నో మిషన్, ఓన్లీ 20% కమిషన్‘ వంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ పోస్టులను ‘కఠినమైన‘ లేదా ‘అసహ్యకరమైన‘విగా పేర్కొన్నప్పటికీ, అవి రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు లోబడి రాజకీయ విమర్శలుగా కోర్టు భావించింది.
విస్పష్టమైన తీర్పు..
ఈ పోస్టులలో హింసను రెచ్చగొట్టడం, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించడం, లేదా అశ్లీలత వంటి నేరపూరిత ఉద్దేశాలు లేవు. అందువల్ల, భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 కింద నమోదైన ఆరోపణలు చట్టబద్ధం కాదని తేల్చింది. ఒకవేళ పరువు నష్టం ఆరోపణలు ఉన్నా, అవి నాన్–కాగ్నిజబుల్ నేరాలుగా, బాధిత వ్యక్తి నేరుగా మేజిస్ట్రేట్‌ను సంప్రదించాలని, మూడో వ్యక్తుల ఫిర్యాదులు చెల్లవని కోర్టు నిర్ణయించింది. ఈ క్రమంలో పోలీసు చర్యలకు కొత్త నియమాలు, ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు సంబంధించి ఎనిమిది మార్గదర్శకాలను జారీ చేసింది.
– హింస రెచ్చగొట్టడం లేదా ప్రజా శాంతికి భంగం కలిగించే ఆధారాలు లేనప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరాదు.
– పరువు నష్టం కేసులలో, బాధిత వ్యక్తి మాత్రమే ఫిర్యాదు చేయాలి. మూడో వ్యక్తుల ఫిర్యాదులు చెల్లవు.
– రాజకీయ విమర్శలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి చట్టపరమైన సలహా తీసుకోవాలి.
– ఆటోమేటిక్ లేదా మెకానికల్ అరెస్టులను నిషేధిస్తూ, సుప్రీం కోర్టు అర్నేష్ కుమార్ తీర్పు (2014)ను అనుసరించాలి.
ఈ మార్గదర్శకాలు, రాజకీయ ఉద్దేశాలతో సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునే అవకాశాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. అయితే, ఈ నియమాలు అమలులోకి వచ్చే వరకు, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అధికార పార్టీలకు ఎదురుదెబ్బ
ఈ తీర్పు అధికార పార్టీలకు ఎదురుదెబ్బే. ఎందుకంటే ఇష్టానుసారం కేసులు నమోదు చేయడానికి వీలు లేదు. తెలంగాణలో, ఆంధ్రాలో ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారం కేసులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కోర్టు తీర్పు ఇప్పుడు రెండు ప్రభుత్వాలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ఈ తీర్పు భావ ప్రకటనా స్వేచ్ఛను బలపరిచినప్పటికీ, సోషల్ మీడియాలో దుర్వినియోగ ధోరణులపై ఆందోళనలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసి, విమర్శలను అడ్డగోలుగా, కొన్నిసార్లు వ్యక్తిగతంగా దాడి చేసే విధంగా ఉపయోగిస్తున్నాయి. ‘20% కమిషన్‘ వంటి వ్యాఖ్యలు రాజకీయ విమర్శల కింద రక్షణ పొందినప్పటికీ, వ్యక్తిగత హననం లేదా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసే వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టవచ్చు. ఈ విషయంలో, కోర్టు లక్ష్మణ రేఖను స్పష్టం చేసింది: హింస లేదా ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశం ఉంటే మాత్రమే నేరపరమైన చర్యలు తీసుకోవచ్చు.అయితే, ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే, రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను విద్వేష ప్రచార సాధనంగా మార్చవచ్చు. ఇది ప్రజాస్వామ్య చర్చను బలహీనపరుస్తుంది. అందువల్ల, రాజకీయ కార్యకర్తలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఈ తీర్పు ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాముఖ్యతను బలపరిచింది. రాజకీయ విమర్శలను అణచివేయడానికి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడం చట్టవిరుద్ధమని, ఇది ప్రజల హక్కులను కాలరాస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా చూడడం రాజకీయ పార్టీల బాధ్యత. ప్రభుత్వాలు కూడా, రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా, చట్టాన్ని నీతిబద్ధంగా అమలు చేయాలి. ఈ తీర్పు, తెలంగాణలో రాజకీయ సంస్కృతిని మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చడానికి ఒక అడుగుగా పనిచేయవచ్చు.