Amaravati Outer Ring Road Project: అమరావతి రాజధాని నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రధానంగా రవాణాకు సంబంధించి కీలక ప్రాజెక్టులను ప్రారంభించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కీలక విషయం బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.25 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. 190 కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో ఈ రహదారిని నిర్మించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల సర్వీస్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. మొత్తం 10 వరుసుల రహదారి నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. వాటినే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పట్టాలెక్కనుంది. అయితే దేశంలో పేరుమోసిన నగరాల్లో నిర్మించిన రింగ్ రోడ్ల మాదిరిగానే.. అమరావతిలో అత్యాధునికంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు.
* గతంలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 70 మీటర్ల వెడల్పుతో చేపట్టాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన భూమిని కూడా సేకరించారు.
* అప్పట్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.16,310 కోట్లు అవుతుందని అంచనా వేశారు.
* అయితే ఇప్పుడు మారిన అలైన్మెంట్తో 14 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించాల్సి ఉంది. అందుకే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 25 వేల కోట్లకు చేరింది.
* అయితే తాజా ప్రతిపాదనలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలోని ప్రాజెక్ట్ అప్రైజల్ టెక్నికల్ స్క్రూట్ ని కమిటీకి పంపారు. అక్కడ ఆమోదం పొందిన తరువాత క్యాబినెట్ ముందుకు చేరుతుంది. కేంద్ర క్యాబినెట్ అనుమతిస్తే టెండర్లను ఖరారు చేసి పనులు ప్రారంభించనున్నారు.
* అయితే ఇప్పటికే పలుమార్లు ఏపీ సీఎం చంద్రబాబు ఇదే విషయంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. అటు తరువాత అలైన్మెంట్లో మార్పులు చేశారు. అందుకే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సైతం ఆమోదముద్ర వేస్తుందని ఆశాభావంతో ఉన్నారు.
* ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు భూసేకరణకు సంబంధించి గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల యంత్రాంగాలకు నేషనల్ హైవే అథారిటీ నుంచి వివరాలు అందాయి.
* మొత్తానికైతే అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.