CM Revanth Reddy : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అసలు వార్తల కంటే.. ఊహగానాలు, గాసిప్స్, నిరాధారమైనవే వార్తలుగా చలామణి అవుతున్నాయి. ఇందులో యూట్యూబ్ స్వయం ప్రకటిత జర్నలిస్టులు కూడా పెరిగిపోయారు. పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేయడం, సొంత లోగోలతో రూపొందించిన గొట్టాలతో రకరకాల ప్రచారాలు చేయడం పరిపాటిగా మారింది. వ్యక్తిత్వ హననం, నిరాధార ప్రచారం, భూతద్దంలో ప్రతి విషయాన్ని పరిశీలించడం సర్వ సాధారణమైపోయింది. ముఖ్యంగా గిట్టని నాయకులు అధికారంలో ఉంటే సహించలేక, గుడ్డ కాల్చి మీద వేసే కార్యక్రమం దర్జాగా సాగిపోతోంది. ఈపార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అని రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ న్యూస్, యూట్యూబ్ ఛానల్స్ ఈ వ్యవహారాన్ని నిర్లజ్జగా కొనసాగిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇలాగే వ్యవహరించగా.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి అనుకూలంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రతి విషయాన్ని అంజనం వేసి మరి చూపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనేది పక్కన పెడితే “మేము బురద చల్లుతాం. కడుక్కోవడం మీ కర్మ” అన్నట్టుగా ఉంటోంది ఆ యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకుల వ్యవహార శైలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యూట్యూబ్ ఛానల్ చేసిన వీడియో తెగ చర్చకు దారి తీస్తోంది. ఇంతకీ ఆ యూట్యూబ్ ఛానల్ చేసిన పని ఏంటంటే..
అది తప్పుగా అనిపించింది
ఇటీవల అధికారిక సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ గొప్పతనం గురించి వివరించారు. మాటల మధ్యలో “దిల్ సుఖ్ నగర్ లో విమానాలు కొనొచ్చు.. అన్ని ఇక్కడే దొరుకుతున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఇది ఆ యూట్యూబ్ ఛానల్ కు తప్పు లాగా అనిపించింది. ఇంకేముంది వ్యక్తిత్వ హననానికి పాల్పడే కార్యక్రమానికి దర్జాగా శ్రీకారం చుట్టింది.. దిల్ సుఖ్ నగర్లో కొంతమందితో మాట్లాడింది.. వారంతా తమ తమ మాటల్లో సమాధానం చెప్పారు. దీంతో వారి మాటలు కాస్త సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. ఈ వీడియోను భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా హ్యాండ్లర్స్ తెగ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఒక బాధ్యత గల యూట్యూబ్ ఛానల్.. ముఖ్యమంత్రి మాటల వెనక ఉన్న అంతరార్ధాన్ని గుర్తించకపోవడం అసలైన దారుణం. ప్రస్తుతం హైదరాబాదులో అన్ని దొరుకుతున్నాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఉదాహరణకి ఆదిభట్లలో మహీంద్రా ఏరోస్పేస్ హెలికాప్టర్ల విడిభాగాలను తయారు చేస్తోంది. హైదరాబాదులో ఇటీవల తయారైన కొన్ని పరికరాలు చంద్రయాన్ ప్రయోగానికి ఇస్రో ఉపయోగించుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ ఘనతలు ఒక పట్టాన అందవు. ముఖ్యమంత్రి ఆదే కోణంలో చెప్పారు. కానీ దీనికి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు వక్ర భాష్యం చెబుతూ ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
బంగారు తెలంగాణ అని ప్రచారం చేశారు
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బంగారు తెలంగాణ అని పదే పదే ప్రచారం చేశారు. కోటి ఎకరాల మాగాణి అని పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు. మరి తెలంగాణ అంత బంగారు మయం అయితే అప్పులు ఎందుకు తెచ్చారు? రెండు సంవత్సరాల ముందుగానే ఎక్సైజ్ పాలసీ ఎందుకు అమలు చేశారు? ఔటర్ రింగ్ రోడ్డును ఆగమేఘాల మీద ఎందుకు లీజుకు ఇచ్చారు? కాలేశ్వరం పేరు చెప్పి మిగతా ప్రాజెక్టులను ఎందుకు పండబెట్టరని? కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ ఖ్యాతిని వివరించడమే ముఖ్యమంత్రి మాటల ఉద్దేశమని, దాన్ని అర్థం చేసుకోలేక కొంతమంది గులాబీ అనుకూల జర్నలిస్టులు ఇలా వితండ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, శుష్క ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టారని, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని.. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి నాయకులకు బుద్ధి రావడం లేదని, ఆ పార్టీ అనుకూల జర్నలిస్టులకు క్షేత్రస్థాయి పరిస్థితి అర్థం కావడంలేదని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.. హైదరాబాద్ చరిష్మాను ముఖ్యమంత్రి వివరిస్తుంటే.. దానిని తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More