Sardar Sarvai Papanna Goud History: తెలంగాణకు భారత దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ రాష్ట్రానికి లేని సంస్కృతి, వారసత్వం, పోరాటాల చరిత్ర తెలంగాణ ప్రాంతానికి ఉంది. ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాలు బ్రిటిష్ పాలనలో ఉండగా, తెలంగాణ మాత్రం రాజులు, తర్వాత నిజాం నవాబుల పాలన సాగింది. అందుకే ఇక్కడ ఉద్యమాలు, పోరాటాలు, తిరుగుబాట్లు ఎక్కువ. ఇలా పోరాడినవారిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఒకరు. తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న (1650–1709) ఒక వీరోచిత వ్యక్తిత్వం. బహుజన సమాజానికి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడిన ఈ యోధుడు నిర్మించిన కోటలు నేటికీ తెలంగాణ గడ్డపై చెరగని ముద్ర వేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంతోపాటు జగిత్యాల, వరంగల్, భువనగిరి వంటి ప్రాంతాల్లో నిర్మించిన కోటలు ఆయన వీరత్వానికి నిదర్శనం. ఈ కోటల చరిత్రను, పాపన్నగౌడ్ ఆశయాలను నేటి తరానికి అందించేందుకు ప్రభుత్వం ‘బహుజన రాజు’ డాక్యుమెంటరీని రూపొందించి విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీ ఆయన జీవితం, పోరాట స్ఫూర్తిని ఆవిష్కరిస్తుంది.
Also Read: ఏపీకి వాయు’గండం’.. పాఠశాలలకు సెలవులపై చంద్రబాబు కీలక నిర్ణయాలు
బహుజన సామ్రాజ్య స్థాపకుడు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో గౌడ కులంలో జన్మించిన పాపన్న, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన తొలి బహుజన నాయకుడు. మొఘల్, కుతుబ్ షాహీ రాజుల నిరంకుశ పాలనను ఎదిరించి, సర్వాయిపేట, తాటికొండ, షాపూరం, భువనగిరి ప్రాంతాల్లో కోటలు నిర్మించి బహుజన రాజ్యాన్ని స్థాపించాడు. గోల్కొండ కోటను జయించి సామాజిక న్యాయం కోసం గెరిల్లా సైన్యంతో పోరాడిన చరిత్ర ఆయనది. కానీ, అగ్ర, ఆధిపత్య కులాల చరిత్రకారులు ఆయన చరిత్రను వక్రీకరించారు. కానీ మళ్లీ ఆయన వాస్తవ చరిత్ర వెలుగులోకి వస్తోంది. తాజాగా డాక్యుమెంటరీ ద్వారా పునర్జన్మ పొందుతోంది.
పాపన్న వీరత్వ సంకేతాలు
సర్వాయిపేటలో 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోట, తాటికొండలో 50 ఎకరాల్లో నాలుగు బురుజులతో నిర్మితమైన దుర్గం, షాపూరం, భువనగిరి, హుస్నాబాద్‌లలోని రక్షణ స్థావరాలు పాపన్న యుద్ధ వ్యూహాత్మక నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. ఈ కోటలు శత్రువులకు దుర్భేద్యంగా, ఆధునిక ఆయుధాల వినియోగంతో నిర్మితమయ్యాయి. సర్వాయిపేట కోట కేంద్రంగా రాజ్య విస్తరణ చేసిన పాపన్న, సామాన్య ప్రజలకు భూములు, సంపదను పంచి, పన్నుల భారం లేని సమాజాన్ని సృష్టించాడు. ‘బహుజన రాజు’ డాక్యుమెంటరీ పాపన్న జీవితాన్ని, ఆయన సామాజిక సమానత్వ ఆశయాలను నేటి తరానికి అందిస్తుంది. ఈ డాక్యుమెంటరీ కరీంనగర్, జగిత్యాల, వరంగల్, నల్గొండ ప్రాంతాల్లోని కోటల చారిత్రక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన పాపన్న స్ఫూర్తిని యువతకు అందిస్తుంది.
పాపన్న చరిత్ర కేవలం గతానికే పరిమితం కాదు. కుల, మత, వర్గ విభేదాలను అధిగమించి సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకం. ఈ డాక్యుమెంటరీ ద్వారా ప్రభుత్వం పాపన్న విగ్రహాల ఏర్పాటు, చారిత్రక ఆనవాళ్ల సంరక్షణకు కట్టుబడి ఉంది. సైదాపూర్‌లో జరిగిన 314వ వర్ధంతి కార్యక్రమం ఈ చరిత్రను పునర్జన్మనిచ్చే ప్రయత్నం జరిగింది. సామాజిక న్యాయం కోసం పోరాడే యువతకు మార్గదర్శనం చేస్తుంది.