AP Rains: ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో( Bay of Bengal) ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రధానంగా కోస్తాంధ్రలో వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఇదే పరిస్థితి మరో 48 గంటలపాటు కొనసాగి అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఫలితంగా ఉత్తరాంధ్రకు తీవ్ర వర్ష సూచన ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
Also Read: నువ్వు లేని లోకంలో ఉండలేనని.. నెలలోపే కోటా శ్రీనివాసరావు సతీమణి కన్నుమూత
* తీవ్ర వాయుగుండం గా మారి
కొద్ది రోజుల కిందట ఉత్తరాంధ్ర( North Andhra), దక్షిణ ఒడిస్సా తీరాలకు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర రూపం దాల్చింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండం గా రూపు దాల్చింది. దీని ప్రభావంతో అటు ఒడిస్సా, ఇటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. మరోవైపు నేడు ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతంగా ఉన్న.. ఒడిస్సా పరిధిలోని గోపాల్ పూర్ వద్ద తీరాన్ని తాకుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అందుకే ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉంది. కోస్తాంధ్రలో సైతం వర్షాలు ప్రభావం చూపుతాయి. తీరంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అందుకే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
* మరో అల్పపీడనం?
మరోవైపు వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని పశ్చిమ మధ్య ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రెండు రోజులపాటు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటల నాటికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో అత్యధికంగా వర్షపాతం నమోదయింది. 73 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా గుళ్ళ సీతారాంపురం లో 66, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 60.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తూరులో 59.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
* అధికారులతో సీఎం సమీక్ష..
ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంలో సీఎం చంద్రబాబు( CM Chandrababu) సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం.. భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని కూడా సూచించారు. జిల్లా కేంద్రాలలో ప్రజల కోసం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.