Sankranthi Festival Traffic: తెలుగు వారికి సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగ ఎంతో సందడి వాతావరణాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో స్థిరపడిన వారికి సంక్రాంతి అంటే చాలా ఇష్టం. అందువల్లే ఈ పండుగకు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తుంటారు. హైదరాబాదులో చాలామంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు స్థిరపడ్డారు. పండగ సమయంలో వారు తమ స్వస్థలాలకు వెళ్తూ ఉంటారు.
సంక్రాంతి సందర్భంగా సహజంగానే విజయవాడ, హైదరాబాద్ హైవే మీద విపరితమైన ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంటుంది. ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇబ్బందులు తప్పవు. అయితే ఈసారి సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది. ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. చాలామంది, సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లాలి అనుకుంటారు. అటువంటి వారికి ఈ కథనం ఎంతో ఉపయుక్తం. ఇంతకు ట్రాఫిక్ సమస్య ఎదురు కాకుండా స్వగ్రామాలకు ఎలా వెళ్లాలంటే..
హైదరాబాద్ నగరంలోని దిల్ షుక్ నగర్ ప్రాంతం నుంచి చౌటుప్పల్ వెళ్లాలంటే దాదాపు గంట వరకు పడుతుంది. గత ఏడాది భోగి సమయంలో ఏకంగా మూడు నుంచి నాలుగు గంటల వరకు సమయం పట్టింది. అంతకుముందు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ రహదారి మీద విపరీతంగా రద్దు ఏర్పడింది. ఈ రద్దీని ఎదుర్కోవాలంటే.. ప్రయాణికులు ఈ మార్గాల మీదుగా వెళ్తే బాగుంటుంది.
హైదరాబాద్ నుంచి నెల్లూరు, గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కెట్ పల్లి వరకు వెళ్తుంటారు. ఆ తర్వాత అద్దంకి హైవే మీద నుంచి ప్రయాణం చేస్తుంటారు. వీరు విజయవాడ జాతీయ రహదారి మీదుగా కనుక వస్తే హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ ఇబ్బందిని ఎదుర్కోకుండా ఉండాలంటే హైదరాబాద్, నాగార్జునసాగర్ హైవే మీదుగా ప్రయాణం సాగిస్తే సరిపోతుంది. ఒకవేళ ఔటర్ రింగ్ రోడ్డు మీదగా వెళ్లాలి అనుకుంటే బొంగలూరు గేట్ వే ఎగ్జిట్ తీసుకొని.. నాగార్జునసాగర్ హైవే మీదికి వెళ్తే బాగుంటుంది.
ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల వెళ్లాలి. అక్కడినుంచి నార్కెట్ పల్లి దాటితే ట్రాఫిక్ లేకుండా వెళ్లిపోవచ్చు.
హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు మాత్రం అవుటర్ రింగ్ రోడ్డు పైకి వెళ్లాలి. ఘట్ కేసర్ లో ఎగ్జిట్ తీసుకోవాలి. వరంగల్ హైవేలోకి ప్రవేశించాలి సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా భువనగిరి వెళ్లాలి.
చౌటుప్పల్ ప్రాంతంలో ప్రతి ఆదివారం సంత జరుగుతూ ఉంటుంది. ఆరోజున వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతుంది. అలాంటప్పుడు పైన సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా వెళ్లిపోవడం మంచిది. మరోవైపు సంక్రాంతి నేపథ్యంలో చౌటుప్పల్ పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడానికి పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.