RS Praveen Kumar phone tapping controversy: పార్టీలు మారినంత మాత్రానా వ్యక్తిత్వం మార్చుకోవాలా అనే ప్రశ్న ప్రస్తుతం రాజకీయాల్లో ఒక చర్చకు తెరలేపింది. ఎంతోమంది ఎన్నో పరిస్థితులు, అవసరాలు, ప్రలోభాలతో పార్టీలు మారడం సర్వసాధారణం. కానీ పార్టీలు మారిన తరువాత కూడా వ్యక్తిత్వంపై ఎలాంటి మచ్చ పడకుండా వ్యవహరిస్తేనే రాజకీయాల్లో రాణిస్తారు.
ఫోన్ ట్యాపింగ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వేర్వేరు పరిస్థితుల్లో చేసిన వ్యాఖ్యలు ఆయన్ను అభిమానించే వారిని కూడా అయోమయానికి గురిచేస్తున్నాయి. అప్పుడు, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల వీడియోలను పక్క పక్కన పెట్టీ మీరు కూడా అంతేనా.. అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: ప్రజా క్షేత్రంలోకి మీనాక్షిని ‘కాంగ్రెస్’ ఎందుకు దింపుతోంది!
అలా ఎందుకు మాట్లాడినట్లు..
ఒక ఐపీఎస్ అధికారిగా చక్కగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు గురుకులాల కార్యదర్శిగా ఒక అవకాశం వచ్చింది. దాన్ని చక్కగా ఉపయోగించుకొని వాటిని తీర్చిదిద్దే క్రమంలో ఆయన చేసిన ఎన్నో నిర్మాణాత్మకమైన మార్పులు మంచి ఫలితాలు ఇచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించేందుకు ఆయన తోడ్పడ్డారు. పూర్వ, ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఏర్పాటు చేసిన స్వేరో తో మరింత పేరు తెచ్చిపెట్టింది.
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు
అనూహ్యంగా ఆయన తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీ లో చేరి రాష్ట్ర కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన అడుగుజాడలో వేలాదిగా విద్యార్థులు, యువత బీఎస్పీ లో చేరి ఎన్నికలకు వెళ్ళారు. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన ఫోర్స్ గా ఎదిగేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని, ఇలాంటి దుర్మార్గమైన చర్యను పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని బీఎస్పీ బహిరంగ సభల్లో గొంతెత్తారు. అంతేకాకుండా ఈ విషయమై పోలీసు కమిషనరేట్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. బిఆర్ఎస్ నాయకత్వాన్ని ఇరుకున పెట్టాయి. ఎన్నికల అనంతరం ఎవరూ ఊహించనివిధంగా ఆయన బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తరువాత ఆయన వ్యవహరించిన తీరులో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు బిఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడ్డ ఆయన ప్రస్తుతం వారిని వెనకవేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ పై చేసిన ఆరోపణలే ఇప్పుడు ఈ ప్రభుత్వంపై చేయడం. అప్పుడు తాను బీ ఆర్ ఎస్ ప్రభుత్వంపై తాను ఆరోపించలేదని, రాజ్యం పై ఆరోపంచనని మాట మార్చడం చర్చనీయాంశమైంది.
పార్టీలు మారినంత మాత్రానా ఒక సాధారణ నాయకుల్లా మాటలు మార్చి చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఆరెస్పీ ఆ పార్టీ అధినేతకు అనుకూలంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుంది. ఆయన్ను బహిరంగంగా ప్రశ్నించేందుకు వెనుకాడుతున్న అనుచరగణం కూడా ఆయన మాట్లాడిన మాటలు విని ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన నాయకుడిగా మంచిపేరున్న ఆరెస్పీ ఈ విషయంలో తడబాటుకు గురికావడంపై వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ తన వ్యక్తిగత స్వేచ్ఛ కు భంగం కలిగించిందని, తాను ఈ విషయంలో గతంలో ఇబ్బంది పడ్డానని చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ అలా చెప్పకుండా ప్రస్తుతం తమ నాయకునికి అనుగుణంగా మాట్లాడడం ఆయన అభిమానులను సైతం ఆలోచిపచేసేలా ఉంది.