Revanth Reddy : రేవంత్ రెడ్డి సమర్పించు.. ‘రూ.500కే గ్యాస్ సిలిండర్’ పాట.. ఇలా కూడా చేస్తారా? వైరల్ వీడియో

తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ విడుదల చేసిన పాటలో ఓ ఇంట్లో ఓ అత్త, కోడలు కనిపించారు. కోడలు మంచం మీద కూర్చుని ఉండగా.. కోడలు పాట అందుకోవడం మొదలు పెట్టింది. "కొత్త కొత్త వంటలెన్నో ఓ అత్తా చిటికలోన నేను చేస్తా. గ్యాస్ పోయి ఉంటే చాలు లొట్టలు వేసే వంటలన్నీ ఇంటిలోనే చేసి పెడతా. ఓ అత్తా రకరకాలు వండి పెడతా.

Written By: Anabothula Bhaskar, Updated On : August 5, 2024 9:54 pm
Follow us on

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మహాలక్ష్మి పథకం విశేషంగా సహకరించింది. ఈ పథకంలో 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని అప్పట్లో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పదేపదే ప్రకటించారు. ఈ పథకం సహజంగానే మహిళా ఓటర్ల పై తీవ్రంగా ప్రభావం చూపించింది. మహిళ ఓట్లు గుంప గుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడేలా చేసింది. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు దీనికి తోడు 500 కే సిలిండర్ అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ప్రచారంలో భాగంగా తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.. ఆ వీడియోలో ఇద్దరు అత్త కోడళ్ల మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంటున్నది. అయితే ఆ సంభాషణను పాట రూపంలో మలచడం ఆసక్తిగా అనిపిస్తోంది. ఇంతకీ ఆ పాటలో ఏముందంటే..

తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ విడుదల చేసిన పాటలో ఓ ఇంట్లో ఓ అత్త, కోడలు కనిపించారు. కోడలు మంచం మీద కూర్చుని ఉండగా.. కోడలు పాట అందుకోవడం మొదలు పెట్టింది. “కొత్త కొత్త వంటలెన్నో ఓ అత్తా చిటికలోన నేను చేస్తా. గ్యాస్ పోయి ఉంటే చాలు లొట్టలు వేసే వంటలన్నీ ఇంటిలోనే చేసి పెడతా. ఓ అత్తా రకరకాలు వండి పెడతా. పొద్దుగాల నేను లేసి ఓ అత్తా చాయ్ చేసి, రొట్టె చేస్తా. గ్యాస్ పోయి ఉంటే చాలు వంటకాలన్నీ చేసి పెడతా. ఓ అత్తా వండి నేను వడ్డిస్తా. ఓ అత్తా. సిత్తరాల ఓ పిల్ల..ఓ కోడలా.. వంటలన్నీ నువ్వు వండితే.. గ్యాస్ పొయ్యి ఖాళీ చేసి, లేనిపోని గోసలన్నీ మళ్లీ మళ్లీ రానీయకు. ఓ పిల్లా గ్యాస్ బండ ఖాళీ చేయకు. తెలంగాణ సర్కారు ఓ అత్తా సబ్సిడీ గ్యాస్ ఇచ్చే. 500 ఇస్తే వంట కోసం గ్యాస్ ఇంటికి వచ్చి అప్పజెప్పే.ఓ అత్తా ఇంటికొచ్చి అప్పజెప్పే. ఔనా కొత్త కోడలా.. ఓ లచ్చిమి ఆ సంగతి ఇంకా నాకు తెలవదే. సబ్సిడీ గ్యాస్ తో వంటలన్నీ నువ్వు చేస్తే ముద్దు ముద్దుగుంటాదే. ఓ పిల్లా గ్యాస్ కు ఇంకా కొదవలేదులే. పండగాకు పిండివంటలు ఓ అత్తా చిటికెలోన నేను చేస్తా. గ్యాస్ పొయ్యి మీదే అప్పలన్నీ నేను చేస్తా. అరిసెలన్నీ నేను చేస్తా. ఓ అత్తా గర్జెలన్నీ నేను చేసి పెడతా. శనగపిండి భజ్జీలు వెయ్యవే.. మటన్ కూర మస్తు చేయవే ఓ పిల్లా.” ఇలా సాగిపోయింది తెలంగాణ డిజిటల్ మీడియా విడుదల చేసిన పాట తీరు..

అధికారంలోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం 500 కు గ్యాస్ సిలిండర్ అందించే పథకానికి శ్రీకారం చుట్టడంతో.. దానిని ఘనంగా ప్రచారం చేసుకునేందుకు ఈ వీడియోను రూపొందించినట్టు తెలుస్తోంది.. ఈ వీడియోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 500 కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. ఇక ఈ వీడియో పూర్తి తెలంగాణ మాండలికంలో సాగింది. అత్తా కోడలుగా నటించిన మహిళలు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కోడలు పాత్రధారి తన హావభావాలతో ఆకట్టుకుంది. మహిళల ఆకట్టుకునేలా ఈ వీడియోలో రూపొందించారు. ప్రస్తుత కాలంలో వంటింట్లో గ్యాస్ సిలిండర్ తప్పనిసరి అయిపోయింది. గతంలో వంట కోసం కట్టెలను వాడేవారు. కార్యక్రమంలో గ్యాస్ వినియోగం అనివార్యం అయిపోయింది. ఇదే సమయంలో వాడకం పెరగడంతో గ్యాస్ సిలిండర్ ధర తారాస్థాయికి చేరింది. అందువల్లే సబ్సిడీ మీద 500 కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో.. ఘనంగా అమలును ప్రారంభించింది. ఇప్పటికే లబ్ధిదారులను గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని తెలంగాణకు రాగానే.. ఈ పథకాన్ని మరింత వేగిరం చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.