Bangladesh protests : బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అక్కడి అధికార పార్టీ అవామీ లీగ్ తెరపైకి తీసుకొచ్చిన కోటా బిల్లు హింసాత్మక పరిస్థితులకు బీజం వేసింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 1971లో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కాస్త వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో ఒక్కసారిగా దేశం లో పరిస్థితి కట్టు తప్పింది. శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రజలు ఆందోళనలు చేస్తూ రోడ్ల మీదికి వచ్చారు. పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఇప్పటివరకు 300 మంది దాకా చనిపోయారు.. ఈ రిజర్వేషన్లను రద్దు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని బంగ్లాదేశ్ కు యువత, విద్యార్థులు పెద్దపెట్టున ఆందోళనకు దిగారు. ఇవి దేశ వ్యాప్తంగా వ్యాపించడంతో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.. దీనివల్ల హింస తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కల్పించుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం కల్పించిన 30% రిజర్వేషన్ ను ఐదు శాతానికి కుదించాలని తీర్పు వెలువరించింది. దీనికి హసీనా ప్రభుత్వం సమ్మతం తెలిపింది. అయినప్పటికీ దేశంలో ఆందోళనలు ఏ మాత్రం తగ్గడం లేదు.
దేశంలో నానాటికి హింస పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి హసీనా ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు సమ్మతం తెలిపారు..”ఆందోళనకారులు దేశంలో అనవసరంగా విధ్వంసం సృష్టిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడేవారు ఉగ్రవాదులతో సమానం. వారికి సంకెళ్లు వేసి బంధించాలి. జైళ్లకు పంపించి కఠిన శిక్ష విధించాలి. అశాంతిని కలగజేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. వారిపై ఉక్కు పాదం మోపాలి. అప్పుడే దేశంలో శాంతి పరిడ విల్లుతుందని” హసీనా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆందోళనకారులతో తాను చర్చలు జరిపేందుకు సిద్ధమని పిలుపునిచ్చారు. అయితే దానికి వారు నిరాకరించారు.
బంగ్లాదేశ్ లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరడానికి ప్రధాన కారణం అక్కడి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ లిస్టు పార్టీతో పాటు ఇటీవల అక్కడి ప్రభుత్వం నిషేధం విధించిన జమాతే ఇస్లామి కారణమని తెలుస్తోంది. ఆ రెండు పార్టీలు హింసను ప్రేరేపిస్తున్నాయని సమాచారం. అయితే ఆ రెండు పార్టీలు మాత్రం తాము ఆందోళనలకు మాత్రమే మద్దతు ఇచ్చామని.. దేశంలో పెరుగుతున్న హింసకు తాము కారణం కాదని చెబుతున్నాయి. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చేందుకు ప్రధాన కారణం.. ప్రజల్లో పెరిగిపోయిన అభద్రతాభావమని ఆ పార్టీలు అంటున్నాయి. ఇక దేశంలో ఇప్పటివరకు ఆందోళనల్లో 300 మంది దాకా చనిపోయారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికి అక్కడ స్తంభించిపోయింది. దీంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు. చివరికి ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు. ముందుగా ప్రత్యేక విమానంలో భారత్ వచ్చారు. ఆ తర్వాత లండన్ వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన వారికి ఐదు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఆందోళనలు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది..” ఈ అల్లర్ల వెనుక ఎవరైనా ఉన్నారా? ఉగ్రవాద సంస్థలు తమ లక్ష్యాన్ని అమలులో పెట్టేందుకు ఇలాంటి ఆందోళనలకు పిలుపునిచ్చాయా” అనే కోణాలలో భారత విదేశాంగ శాఖ పరిశీలన జరుపుతోంది. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడారు. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించారు.