Nizamabad KFC: ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. కారంగా.. క్రిస్పీగా.. ఇంకొంచెం ఘాటుగా.. వేడివేడి చికెన్ ముక్కలను లొట్టలు వేసుకుంటూ తింటూ.. అందులోకి కూల్ డ్రింక్ తాగుతూ ఆస్వాదించేవారు చాలామంది ఉంటారు. సాయంత్రం సమయంలో చల్లగా ఉన్న వాతావరణాన్ని.. ఇలాంటి వేడి ఫుడ్ తింటూ చాలామంది ఆస్వాదిస్తూ ఉంటారు. అందువల్లే కేఎఫ్ సీ రెస్టారెంట్లు సాయంత్రం సమయంలో విపరీతమైన రద్దీగా ఉంటాయి. దీనికి తోడు కేఎఫ్ సీ లో వినియోగదారులు కోరుకున్నట్టుగా చికెన్ లో వెరైటీలు లభిస్తుంటాయి.. లెగ్ పీస్, జాయింట్ వింగ్స్, చెస్ట్ పీస్ లు.. ఇలా రకరకాల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. ఈ తరహా చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నప్పటికీ చాలామంది వినిపించుకోరు. పైగా లొట్టలు వేసుకుంటూ తింటారు.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
అనేక సందర్భాలలో అనేక సందర్భాలలో కేఎఫ్ సీ లో చికెన్ ఆరోగ్యానికి మంచిది కాదని.. అందులో హానికరమైన పదార్థాలు ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ చాలామంది పట్టించుకోరు. ఎక్కడో జరిగింది కదా.. ఇక్కడైతే కాదు కదా అని సర్ది చెప్పుకుంటారు. పైగా భారీ ఆర్డర్లు పెట్టి తమ కడుపును నింపుకుంటారు. చికెన్ మాత్రమే కాదు శీతల పానీయాలు కూడా విపరీతంగా తాగుతుంటారు. అందువల్లే మనదేశంలో కేఎఫ్ సీ రెస్టారెంట్లు విపరీతంగా ఉంటాయి. సినిమా థియేటర్లు.. పెద్దపెద్ద మాల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీలు ఉన్నచోట.. హాస్టల్స్ ఉన్నచోట కే ఎఫ్ సీ రెస్టారెంట్లకు కొదవ ఉండదు. ఓ నివేదిక ప్రకారం మనదేశంలో కే ఎఫ్ సీ ప్రతి ఏడాది వందల కోట్ల వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఇంకా తన వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉంది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కే ఎఫ్ సీ రెస్టారెంట్ కు సంబంధించి ఒక దారుణమైన నిజం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నగరంలో వేణు మాల్ లో ఇటీవల కొందరు చికెన్ లెగ్ పీస్ ఆర్డర్ చేశారు. అది తింటూ ఉండగా కుళ్ళిపోయిన వాసన వచ్చింది. దీంతో ఒక కస్టమర్ వచ్చి నిర్వాహకులను నిలదీశాడు. దీంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీనికి తోడు వింగ్స్ ఆర్డర్ పెట్టిన వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవం ఎదురయింది. దీంతో అతడి కూడా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కస్టమర్లు ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పైగా వెగిలిగా నవ్వారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత కే ఎఫ్ సీ రెస్టారెంట్లు మాత్రమే కాదు.. బయట తినాలంటేనే భయం వేస్తోందని నెటిజన్లు వాపోతున్నారు.