ACB Raids: ఆ మేడం గారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఎంత లేదనుకున్నా సరే నెలకు జీతం రెండు లక్షల దాకా వస్తుంది. బయట అమ్యామ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మేడం గారు తన స్థాయికి తగ్గట్టుగానే సంపాదించుకున్నారు. ఇంకా సంపాదన వేటలో పడ్డారు. ఇటీవల హైదరాబాద్ నగర పరిధిలోని మంచిరేవుల ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారాలు జోరుగా సాగుతూ ఉంటాయి. పైగా ఈ ప్రాంతానికి దగ్గరలోనే కోకాపేట.. నార్సింగి.. అప్పా.. ఖరీదైన ప్రాంతాలు ఉన్నాయి. దీంతో మేడం గారు తన రూటే సపరేటు అంటూ వసూళ్ల వేట కొనసాగించారు. తక్కువలో తక్కువ ఒక్క ఫైల్ మూవ్ కావాలి అంటే లక్షలు ఇవ్వాల్సిందేనని కండిషన్ పెట్టారు.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగానే ఉన్నప్పటికీ మేడంగారు లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఆమె బాధ తట్టుకోలేక చాలామంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. గ్రీవెన్స్ డే లో కూడా ఈ మేడం గారి మీద కలెక్టర్ గారికి విపరీతంగా కంప్లైంట్ లు వెయ్యాలి. అయినప్పటికీ ఆమె మీద ఈగ కూడా వాల లేదు. ఇదే అదునుగా ఆ మేడం గారు మరింత రెచ్చిపోయారు. మంచిరేవుల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు మొత్తం చెల్లించారు. డాక్యుమెంట్లు కూడా సక్రమంగానే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం దగ్గరికి వెళ్లేసరికి సదరు మేడం గారు ఆ ఫైల్ తొక్కిపెట్టారు. లంచం ఇస్తేనే పనిచేస్తానని డిమాండ్ చేశారు. 10 లక్షలు ఇవ్వాల్సిందేనని అతనికి షరతు విధించడంతో తట్టుకోలేకపోయాడు. చివరికి ఐదున్నర లక్షలకు బేరం కుదిరింది. మంగళవారం మంచిరేవుల లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో తన వద్ద ఉన్న నాలుగు లక్షల ను తీసుకొని ఆ వ్యక్తి వెళ్ళాడు. ఆ మేడం గారికి ఇచ్చాడు. ఇంతలోనే అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆమె పనిచేస్తున్న విభాగంలోకి వెళ్లారు. రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు. అంతే ఒక్కసారిగా ఆమె ఏడుపు మొదలుపెట్టారు. మహానటి ని మించి పోయే రేంజ్ లో యాక్టింగ్ చేశారు. కన్నీరు పెట్టారు. గోల చేశారు. అయినప్పటికీ ఏసీబీ అధికారులు ఊరుకోలేదు.
ఇంత ఉపోద్ఘాతం రాసాం కదా.. ఆమె పేరు చెప్పలేదని.. ఆమె గురించి వ్యక్తిగత వివరాలను వెల్లడించలేదని అనుకుంటున్నారు కదా.. ఆ అధికారి పేరు మణిహారిక. పేరులోనే మనీ ఉంది కాబట్టి మేడం గారికి డబ్బులు అంటే చాలా ఇష్టం. పైగా మంచి రేవుల ప్రాంతంలో పనిచేస్తోంది కాబట్టి.. మనీ మీద మరింత మమకారం పెంచుకుంది. చివరికి ఇదిగో ఇలా ఏసీబీ అధికారులకు చిక్కిపోయింది.. ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో వరసగా దాడులు చేస్తున్నప్పటికీ.. అవినీతి అధికారులను అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ.. ఇదిగో ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. లంచానికి మరిగి అడ్డమైన పనులు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల మీద ప్రజలకు విరక్తి కలిగేలా చేస్తున్నారు.