RK Weekend Comment 28 December 2025: రాజకీయాలు ఒకప్పటి మాదిరిగా లేవు. నేతల మధ్య సంబంధాలు కూడా చెప్పుకునే స్థాయిలో లేవు. హద్దులు చెరిపి వేసుకుంటున్న నాయకులు.. ముతక భాషను వాడుక భాషగా మార్చుకుంటున్నారు. ఒకరి పొడ మరొకరికి గిట్టనంత స్థాయికి దిగజారు. పరస్పరం గౌరవించుకోవడం లేదు. కక్షలు పెంచుకుంటున్నారు. తొడ కొట్టి సవాళ్లు విసురుకుంటున్నారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ ఇలాంటి సుభాషితాలు చాలానే రాశారు.
ఒక పత్రిక అధిపతిగా, సీనియర్ పాత్రికేయుడిగా రాధాకృష్ణ ఇలా సుభాషితాలు రాయొచ్చు. రాసే అధికారం కూడా ఆయనకు ఉంది. కానీ ఒక వేలుతో ఒకరిని చూపిస్తే.. మిగతా నాలుగు వేళ్ళు మనల్ని చూపిస్తాయనే ఇంగితాన్ని రాధాకృష్ణ మర్చిపోయినట్టున్నారు. రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎలా మాట్లాడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..
కవితను ఆమధ్య ఇంటర్వ్యూ చేసినప్పుడు రాధాకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడిగారు? ఆమెను ఏ విధంగా సంబోధించారు? కేటీఆర్ ను కెసిఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు.. తిక్కలోడు అని వ్యాఖ్యానించింది కూడా ఇదే రాధాకృష్ణ. అక్కడిదాకా ఎందుకు సాక్షి మీడియా ప్రస్తావన వస్తే రాధాకృష్ణ తన పత్రికలో నీలి మీడియా అని రాస్తారు కదా.. అక్రమ పెట్టుబడులతో పెట్టిన పత్రిక అంటూ రాస్తారు కదా.. జగన్మోహన్ రెడ్డిని సైకో అని.. వైసిపి పార్టీ కార్యకర్తలను హంతకులని సంబోధిస్తారు కదా.. అప్పుడు ఈ నీతి వాక్యాలు రాధాకృష్ణకు గుర్తుకు రావా..
కెసిఆర్ మాట్లాడిన మాటలు.. రేవంత్ ఇచ్చిన కౌంటర్.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ మేం సమర్థించడం లేదు. రాధాకృష్ణను మేము వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. కొత్త పలుకు సంపాదకీయంలో రాధాకృష్ణ అలా రాయడం వల్లే ఇలా ప్రశ్నించాల్సి వస్తోంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు అనుకూలమైన వ్యక్తులు కాబట్టి.. వారిద్దరి మధ్య సత్సంబంధాలు గొప్పగా ఉన్నాయని చంద్రబాబు రాశారు. మరి అదే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మధ్య సత్సంబంధాలు కొనసాగుతుంటే రాధాకృష్ణ ఎందుకు సానుకూల ధోరణిలో చూడలేకపోతున్నారు?
రాధాకృష్ణ టెంపర్మెంట్ ఉన్న జర్నలిస్టు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. పైగా కొన్ని విషయాలలో కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. ఈ స్థాయిలో నిష్పక్షపాతం ప్రదర్శించే జర్నలిస్టు ఇటీవల కాలంలో లేరు. కానీ, కొన్ని విషయాలలో మాత్రం రాధాకృష్ణతో విభేదించాల్సి వస్తోంది. ఎందుకంటే వాస్తవం ఒకటైతే, ఆయన చెప్పేది మరొకటి. అందువల్లే అది వినే వాళ్లకు, చదివే వాళ్లకు మింగుడు పడడం లేదు.
