RK Kotha Paluku: గులాబీ పార్టీ కార్యకర్తలు విమర్శిస్తారు.. ఇతర పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తారు గాని.. ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణ టెంపర్ మెంట్ గురించి వాళ్లకు తెలియదు. అప్పుడప్పుడు తనలో ఉన్న జర్నలిస్టును ఆర్కే బయట పెట్టినప్పుడు ఆరోజు మంటలే. భాస్కరుడిలాగా వెలుగుతుంటాడు. తన అక్షరాలతో భాస్వరం లాగా మండుతుంటాడు. ఆదివారం నాటి ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు సంపాదకీయంలో రాధాకృష్ణ తన జర్నలిస్ట్ టెంపర్ మెంట్ చూపించాడు. గొప్ప సంపాదకీయం అని కీర్తించేటప్పుడు జగన్ ను తగులుకున్నాడు. ఇక అక్కడే ఆగిపోయాడు.
జగన్, రాధాకృష్ణకు గెట్టు పంచాయతీలు లేవు. ఇద్దరు పరస్పరం ఎదురు పడి తిట్టుకున్న దాఖలాలు లేవు. కానీ నిత్యం జగన్ గురించి రాధాకృష్ణ ఏదో ఒక రూపంలో ప్రస్తావిస్తూనే ఉంటారు. తనివి తీరా తిడుతూనే ఉంటారు. పత్రికలో అయితే తనే రంగంలోకి దిగి రాస్తుంటారు.. ఇక తన ఛానల్ లో అయితే విచ్చలవిడిగా కథనాలను ప్రసారం చేస్తూనే ఉంటారు.. ఈ పంచాయితీ ఇప్పట్లో తెగదు. తెంపడానికి ఎవరూ సాహాసించరు. జగన్ మీడియా ఆంధ్ర జ్యోతిని తోక పత్రిక అని సంబోధిస్తే.. జగన్ మీడియాను రాధాకృష్ణ బ్లూ మీడియా అంటూ ఆరోపిస్తారు.
తాజా కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ మనదేశ న్యాయ వ్యవస్థ మీద అక్షర బాణాలను సంధించారు. సుప్రీంకోర్టు విశ్వసనీయతను ప్రశ్నించారు. న్యాయవాదులు ఎలా ఉంటున్నారు? న్యాయమూర్తులు ఎలా తీర్పు చెబుతున్నారు? న్యాయస్థానాలలో కేసులు ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి? ఒక న్యాయమూర్తి ఇంట్లో ప్రమాదం జరిగితే భారీగా డబ్బు ఎలా బయటపడింది? అలాంటి న్యాయమూర్తి పై మన దేశ న్యాయ వ్యవస్థ ఎటువంటి చర్యలు తీసుకుంది? సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థకు ఉన్న విశ్వసనీయత ఎటువంటిది? అనే విషయాలపై చాలా లోతుగా రాసుకు వచ్చారు రాధాకృష్ణ. వాస్తవానికి ఇటీవల కాలంలో రాధాకృష్ణ కాలం నుంచి ఈ స్థాయి పొటెన్షియాలిటీ ఉన్న సంపాదకీయం రాలేదు.
న్యాయ వ్యవస్థ మీద మాత్రమే రాధాకృష్ణ ఆగిపోలేదు.. గవర్నర్ల వ్యవస్థ పై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్లు, విపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్లు ఎలా వ్యవహరిస్తున్నారు? అనే విషయాన్ని కూడా రాధాకృష్ణ లేవనెత్తారు. తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళింది? గవర్నర్లతో పాటు రాష్ట్రపతికి కూడా కీలకమైన బిల్లుల విషయంలో గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? దానికి రాష్ట్రపతి కార్యాలయం ఏ విధంగా స్పందించింది? అనే విషయాలను స్పష్టంగా చెప్పగలిగారు రాధాకృష్ణ.. రాష్ట్రపతి కార్యాలయానికి కేంద్రం ఏ విధంగా గొంతు కలిపింది.. తద్వారా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది.. అనే విషయాలను కూడా ప్రస్తావించారు.
వాస్తవానికి ఇటువంటి సంపాదకీయం రాయాలంటే కాస్త దమ్ము ఉండాలి. అన్నింటికీ మించి తెగింపు ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాధాకృష్ణ మరో మాటకు తాగులేకుండా రాసేశారు. తన సంపాదకీయంలో టిడిపి లేకుంటే, చంద్రబాబు ప్రస్తావన రాకుంటే, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకుంటే ఎలా ఉంటుందో రాధాకృష్ణ మరోసారి నిరూపించారు. ఏకంగా “జ్యుడీషియల్ యారగన్సి” అనే బరువైన పదాన్ని వాడారు అంటేనే రాధాకృష్ణ ధైర్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.. అంతేకాదు కోర్టులు గడువు ఎందుకు విధిస్తాయి? గడుగు వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? సామాన్య ప్రజలు ఏ స్థాయిలో బాధపడుతున్నారు? అనే విషయాలను అత్యంత లోతుగా వెల్లడించారు రాధాకృష్ణ.. ఇంత గొప్ప సంపాదకీయం రాసినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి.. ఆయన 13 సంవత్సరాలు పాటు బెయిల్ మీద ఉన్నారు. మధ్యలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఆయన నిర్ణయాల వల్ల ఏపీ రాష్ట్రం నష్టపోయిందని భావించి ప్రజలు 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేశారు.. ఇలా తనలో ఉన్న అక్కసు మొత్తాన్ని బయటపెట్టుకున్నారు రాధాకృష్ణ.. ఎంతైనా చంద్రబాబుకు జగన్ అంటే కోపం. కాబట్టి రాధాకృష్ణకు కూడా అదే స్థాయిలో కోపం..