Jagan And KTR: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) కెసిఆర్, జగన్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిన విషయమే. పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా ఇద్దరు వెళ్తారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడి రాజకీయ ప్రయోజనాలకి పెద్దపీట వేశారు. అయితే ఇప్పుడు ఇద్దరూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. వారిద్దరూ ఉమ్మడి శత్రువుగా భావించే చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యారు. ఆయన సన్నిహితుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఆపై చంద్రబాబు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు విషయంలో కెసిఆర్ పార్టీ వైఖరి మారింది. కానీ జగన్ మాత్రం అదే శత్రుత్వంతో మెలుగుతున్నారు. ఎందుకంటే ఏపీలో నేరుగా ప్రత్యర్థి కాబట్టి. ప్రస్తుతం బెంగళూరులో ఎక్కువగా గడుపుతున్న జగన్మోహన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ వెళ్లారు. అక్కడ భారీగా జన సమీకరణ చేశారు. హైదరాబాదు నుంచి బెంగళూరు చేరుకున్న జగన్మోహన్ రెడ్డిని తాజాగా ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్నారు కేటీఆర్. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు..
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలకు చంద్రబాబు( CM Chandrababu) ఉమ్మడి శత్రువు. ఆపై కాంగ్రెస్ అంటే వ్యతిరేక స్వభావం. బిజెపితో కలవాలనుకున్న వీలు లేని పరిస్థితి. ఏ కూటమిలో చేరే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి సంకట స్థితిని ఆ రెండు పార్టీలు ఊహించి ఉండవు. అయితే ప్రస్తుతం ఆరోగ్యం రీత్యా కెసిఆర్ అంత క్రియాశీలకంగా లేరు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరపడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ ఏం చర్చించారు? రాజకీయంగా కలిసి అడుగులు వేయబోతున్నారా? లేకుంటే ఎన్నికల వరకు వేచి చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే తప్పకుండా కొద్ది రోజులపాటు వేచి ఉండాల్సిందేనని ఇద్దరు నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2029 ఎన్నికల ముందున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందామని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
* ఆ ఇద్దరి కలయిక పై సెటైర్లు..
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బిజెపిని( Bhartiya Janata Party) తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టదు. జనసేన సైతం ఆ సాహసం చేయదు. అందుకే లేనిపోని రాజకీయాలు చేయడం కంటే గతం మాదిరిగా ఒంటరి పోరాటమే ఆ రెండు పార్టీలకు ముందున్న కర్తవ్యం. మరోవైపు జగన్మోహన్ రెడ్డితో పాటు కేటీఆర్ కు కేసులు వెంటాడుతున్నాయి. ఈ క్షణంలోనైనా వారి అరెస్టు జరుగుతుందని ప్రచారం నడుస్తోంది. అయితే వారు జైలుకు వెళ్తే పార్టీలు ఎవరు నడుపుతారు అన్నది ప్రశ్న. ఆ ఇద్దరు నేతలకు చెల్లెళ్ల నుంచి ప్రమాదం ఉంది. తెలంగాణలో కవిత, ఏపీలో షర్మిల సోదరులను విభేదించి రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చెల్లెళ్లను ఎలా కట్టడి చేయాలో తెలియక ఇద్దరు మల్ల గుల్లాలు పడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సైతం సెటైర్లు పడుతున్నాయి.