RK Kotha Paluku: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం తెలంగాణ రాజకీయాలలో ఊహించని అలజడికి కారణమైంది. సిట్ ఏర్పాటు.. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు.. ఆ తర్వాత వ్యవహారం కోర్ట్ దాకా వెళ్లడం.. వంటి పరిణామాలు తీవ్రమైన చర్చకు దారి తీశాయి. ఇదంతా జరుగుతుండగానే ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఆదివారం నాటి కొత్త పలుకులో సంచలన విషయాలను రాసుకొచ్చారు.
ఎన్టీవీ ఆ స్థాయిలో కథనాన్ని ప్రసారం చేయడం వెనక నైని కోల్ బ్లాక్ లో తవ్వకాలు ఉన్నాయని.. భట్టి విక్రమార్క, ఎన్ టివి నరేంద్ర చౌదరి అల్లుడు, మేఘా కంపెనీల ఆధ్వర్యంలో ఓ మెగా వెంచర్ ఏర్పాటు చేశారని.. దానికోసమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద అడ్డగోలుగా కథనాన్ని ప్రసారం చేశారని రాధాకృష్ణ ఆరోపించారు. రాధాకృష్ణ రాసిన కథనం తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఒక మహిళా అధికారి పట్ల ఈ స్థాయిలో వ్యతిరేక కథనాన్ని రాయడాన్ని రాధాకృష్ణ విమర్శించారు. ఒక పాత్రికేయుడిగా రాధాకృష్ణ ఇలా ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ, గతంలో షర్మిల మీద, కవిత మీద రాధాకృష్ణ ఎలాంటి వార్తలు రాశారో అందరికీ తెలుసు.
మద్యం కుంభకోణంలో పేరు తెరపైకి వచ్చిన తర్వాత కవితను రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఆమె వ్యక్తిత్వం దెబ్బ తినే విధంగా ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో సమాధానాలు చెప్పడానికి కవిత తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పాత్రికేయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాధాకృష్ణ అలాంటి ప్రశ్నలు వేయడాన్ని ఎవరూ ఆమోదించలేకపోయారు. దానికంటే ముందు షర్మిలను కూడా రాధాకృష్ణ ఇదే స్థాయిలో ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు కూడా ఆయన తిక్క తిక్క ప్రశ్నలు వేశారు.
ఎన్టీవీ కథనం తర్వాత రాధాకృష్ణకు ఆడవాళ్ళ మీద గౌరవం అమాంతం జరిగిపోయింది. ఆడవాళ్ళ మీద అలాంటి స్టోరీలు రాస్తారా అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కానీ, గతంలో ఆయన లక్ష్మీపార్వతి మీద, షర్మిల మీద, కవిత మీద ఎలాంటి రాతలు రాశారో అందరికీ తెలుసు. షర్మిల ఆ స్థాయిలో పాదయాత్ర చేస్తుంటే కనీసం తన పత్రికలో సింగిల్ పేజీ వార్త కూడా ప్రచురించడానికి రాధాకృష్ణ ఒప్పుకోలేదు. చివరికి కవిత విషయంలో కూడా రాధాకృష్ణ అభూత కల్పనలకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.
రాజకీయ లక్ష్యాల కోసం.. వ్యక్తిగత ఏజెండాల కోసం మీడియా అధినేతలు పాకులాడుతున్నారు. వ్యాపారాల కోసం.. ఇతర ప్రయోజనాల కోసం మీడియాను చేతులలో పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. నచ్చిన ప్రభుత్వం మీద ఈగ వాలకుండా చూసుకుంటున్న మీడియా అధినేతలు.. గిట్టని వ్యక్తుల మీద బురద చల్లడంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ ఎన్టీవీ వ్యవహారంలో జరిగింది కూడా ఇదే. అయితే ఇందులోకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణరావడంతో వ్యవహారం కాస్త రక్తి కడుతోంది.
