Revanth Reddy Strategy: అధికార పీఠం అంటేనే చిక్కుముడులతో కూడుకొని ఉంటది. ముఖ్యమంత్రి అనే ముళ్ళ కిరీటం ధరించడం సాధారణ విషయం కాదు. సమస్యలు ఒకటి తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఆ సవాళ్లను ఎదుర్కోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్తేమీ కాదు. అయితే విభిన్న రాజకీయ నేపథ్యం ఉన్న రేవంత్ రెడ్డికి వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నారు. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని నిర్ద్వందంగా ప్రకటించడం తో ఆయన విధానం ప్రస్పుటంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప రాజకీయ బంధువులు, బంధుత్వాల గురించి తాను పట్టించుకోరని స్పష్టంగా ఒక మెసేజ్ ఈ రూపంలో ఇచ్చారు. గతంలో ఏ పార్టీకి పార్టీకి ప్రాతినిధ్యం వహించినా, ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీ ఏలుతున్న తెలంగాణ ముఖ్యమంత్రిగా తీసుకోవలసిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడని మరోసారి తేటతెల్లమైంది. తమ్ముడు, తమ్ముడే.. పేకాట.. పేకాటనే అనే ధోరణి తో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పై ఎన్ని విధాలుగా ఇరుకున పెట్టాలని ప్రయత్నించినా లాభం లేదనే విషయం విపక్షాలకు ఎప్పుడో తెలుసు.
మొదటి నుంచి అలాగే వ్యవహరిస్తూ వస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రస్తానం చూస్తే అవగతమౌతుంది.
మొదటి నుంచి అదే వరుస..
విద్యార్థి దశలో చురుకైన ఎబివిపి కార్యకర్తగా పనిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజకీయాలు ఓనమాలు దిద్దుకున్నారు. అప్పుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని బలంగా నిర్ణయించుకున్న ఆయన ఈ పార్టీ మద్దతు తీసుకోకుండా, తన జన్మస్థలం కొడంగల్ నుంచి జెడ్పీటీసీ గా పోటీ చేసి గెలిచి మొదటి పరీక్షలో నెగ్గాడు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమై, వివిధ పార్టీలకు చెందిన సహచర జెడ్పీటీసీలు, ఎంపీటీసీల పరిచయంతో వారి మద్దతు కూడకట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాడు. అయితే రాజకీయ పరమపద సోపానం లో చివరి మెట్టు ఎక్కేందుకు అవసరమైన అన్ని దారులను పరిశీలించి, ఒంటరి పోరు కాకుండా ఒక బలమైన రాజకీయ పార్టీని ఎంచుకొని విస్తరించాలని భావించారు.
Also Read: Kavitha Praises Revanth: రేవంత్ రెడ్డికి జై కొట్టిన కల్వకుంట్ల కవిత
అన్ని పార్టీలలో పనిచేసిన అనుభవం
అప్పుడే తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ తీరుతెన్నులు, పార్టీ అంతర్గత పరిస్థితులను ఆకళింపు చేసుకొని ముందుకు వెళుతున్న క్రమంలో, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. సమయంలో బలమైన పార్టీగా ఎదుగుతున్న టీడీపీలో చేరాడు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు
ఆ కాలంలో చంద్రబాబుకు అంత్యంత సన్నిహితులుగా మెలిగిన వారిలో రేవంత్ రెడ్డి ఒకరు. పార్టీలో పరిస్థితులు చక్కదిద్దే విషయంలో రేవంత్ రెడ్డి చూపే చొరవ ఆయన్ను చంద్రబాబు కు మరింత దగ్గరగా చేర్చింది. అనూహ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరుణంలో టీడీపీ భవిష్యత్ ను ముందే పసిగట్టిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరడం, ఒక జాతీయ అనుసరించే విధానాలు ఎలా ఉంటాయో ఇదివరకే ఒంటబట్టించుకున్న రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతో నేరుగా బేటీ అయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఈ విధంగా ప్రయత్నించాలని విషయాలపై తాను రూపొందించిన రోడ్ మ్యాప్ ను వారి ముందుంచారు. దీంతో ఒక్కసారిగా ఆయన ప్రజెంటేషన్ నచ్చిన సోనియా, రాహుల్ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి గేర్ మార్చిన రేవంత్ రాష్ట్రంలో కాంగ్రెస్ దిగ్గజాలను సైతం తనవైపుకు తిప్పుకునేందుకు తనవంతు ప్రయత్నం తాను చేస్తూ, మరోవైపు అధిష్టానం సహాయంతో పార్టీలో తోక జోడించే వృద్ధ జంబూకాలను నియంత్రించగలిగాడు.
కలహాల కాంగ్రెస్ కు దివిటీ అయి నిలిచాడు
ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో విబేధాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ నాయకులందరినీ కార్యోన్ముఖులను చేసేందుకు అన్ని విధాలు అనుసరించి, ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా వ్యూహరచన చేసి అనుకున్నది సాధించాడు. ఏ సమయంలో ఎవరితో ఎలా ఉండాలో స్పష్టంగా ఒంటబట్టించుకున్న రేవంత్ రెడ్డికి కార్యకర్తల నుంచి పార్టీ హైకమాండ్ వరకు ఏ విధంగా ఆలోచించారనే విషయంపై పూర్తి అవగాహన ఉందని నిరూపించుకున్నాడు. కేవలం ఒకే పార్టీ లో సంవత్సరాల తరబడి రాజకీయాలు చేసే నాయకులకు భిన్నంగా వివిధ పార్టీలలో క్రియాశీలకంగా వ్యవహరించి కూడా వాటి ప్రభావం తనపై పడకుండా జాగ్రత్త పడ్డారు.
Also Read: Telangana Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ అందుకే లేట్ చేస్తోందా
ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్న సమయంలో సైతం ఒకవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో అవసరమైన సమయంలో అనుసరించే విధానం, అలాగే పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వ్యవహరించే తీరు గమనార్హం.
ఎలా వచ్చాడంటే…
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పట్టుదలతో ఒక్కో మెట్టు పైకి ఎక్కి తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా మారాయి. ఒకవైపు పరిపాలన, మరోవైపు విపక్షాల దాడి, ఇంకోవైపు బిఆర్ఎస్, బీజేపీ ఏర్పరచుకున్న సోషల్ మీడియా నెట్వర్క్ గుప్పిస్తున్న విచ్చలవిడి ప్రచారం దాన్ని అనుసరిస్తూ వ్యవహరిస్తున్న మీడియా సంస్థల ప్రతినిధులు అడిగే ప్రశ్నలు రేవంత్ రెడ్డికి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు. ఆ సవాళ్లను సైతం అలవోకగా ఎదుర్కొని ముందుకు వెళ్ళే విషయంలో రేవంత్ రెడ్డి కొత్త విధానానికి తెరలేపినట్లు తెలుస్తోంది.