CM Revanth Reddy: గత ఎన్నికల్లో బిజెపి నాలుగు స్థానాల్లో గెలిచింది.. ఈసారి ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది. మొత్తంగా చూస్తే అసెంబ్లీలో 8.. పార్లమెంట్ లో 8.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం మాత్రమే ఓట్లు లభించాయి. కేవలం 5 నెలల వ్యవధిలోనే బిజెపి ఓట్ల శాతం పెరిగింది. ఏకంగా 37.5%కి చేరుకుంది. 2019లో బిజెపికి 20% ఓట్లు లభిస్తే.. ఈ ఎన్నికల్లో 37.5 శాతానికి పెరిగాయి. గత పార్లమెంటు ఎన్నికలతో పోల్చుకుంటే 17.5 ఓట్లు బిజెపికి అదనంగా పోల్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే 24.5 శాతం ఓట్లు పెరిగాయి.. ఓట్లు, సీట్లు పెరగడంతో బిజెపి నాయకులు పండగ చేసుకుంటున్నారు. కేంద్రంలో పూర్తిస్థాయిలో మెజారిటీ లభిస్తే.. వారి ఆనందం మరింత రెట్టింపు స్థాయిలో ఉండేదేమో…
తెలంగాణలో బిజెపి ఎందుకు ఇంతలా బలపడింది? దీనికి కారణాలేంటి? అనే ప్రశ్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత.. బుధవారం ఆయన మీడియా ముందుకు వచ్చారు.. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. “పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులను కదిలించారు.. ఏకం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి 39.5% ఓట్లు లభించాయి. వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగాం. ఎన్నికలకు ముందే ఇవి మా వందరోజుల ప్రజా పరిపాలనకు రెఫరండం అని చెప్పేశాం. 17 పార్లమెంటు స్థానాలలో 8 కైవసం చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు మా పార్టీకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 1.5 శాతం ఓట్లు మాకు అదనంగా పడ్డాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ మా పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు ద్వారా మరో సీటు మాకు అదనంగా లభించింది. 2019 ఎన్నికల్లో బిజెపి నాలుగు స్థానాల్లో గెలిస్తే.. ఈ ఎన్నికలలో 8 స్థానాల దాకా వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 20 శాతం ఉన్న వారి ఓట్లు 35% పెరిగాయి. భారత రాష్ట్ర సమితి నాయకులు ఆత్మబలిదానం చేసుకున్నారు. అవయవ దానం చేసి బిజెపి నాయకులను గెలిపించారు. బిజెపి గెలిచిన ఏడు స్థానాలలో భారత రాష్ట్ర సమితి డిపాజిట్ కోల్పోయింది.. మెదక్ పార్లమెంటు స్థానాల్లో రఘునందన్ రావు గెలిచేందుకు హరీష్ రావు తమ పార్టీకి చెందిన ఓట్లను మొత్తం బిజెపికి బదిలీ చేశారు. బలహీన వర్గాల బిడ్డను ఓడించారు. వెంకటరామిరెడ్డిని నమ్మించి మోసం చేశారు. బిజెపిని కావాలని గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5% ఓట్లు పొందిన భారత రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపోయిందని” రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్ పై కూడా రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు.. రాష్ట్రంలో తనంతట తానే అంతర్ధానమై బిజెపికి కేసిఆర్ మద్దతుగా నిలిచారని రేవంత్ ఆరోపించారు. బూడిదైన భారత రాష్ట్ర సమితి మళ్లీ పుట్టేది లేదని కేటీఆర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి విమర్శించారు. వందరోజుల పరిపాలనపై భారత రాష్ట్ర సమితి చేసిన ఆరోపణలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని.. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న భారత రాష్ట్ర సమితిని ప్రజలు మరోసారి తిరస్కరించారని రేవంత్ అన్నారు. ఇప్పటికైనా భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ తన వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. కెసిఆర్ ఒక రాజకీయ జూదగాడని, అతడు ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయని.. కెసిఆర్ లాంటి అవినీతిపరుడు బిజెపితో ఎలా జతకడతాడో చూడాలని రేవంత్ అన్నారు. ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తే కాలగర్భంలో కలిసిపోతారని హరీష్ రావును ఉద్దేశించి రేవంత్ హెచ్చరించారు. మోదీ గ్యారెంటీకి కాలం చెల్లింది కాబట్టే 303 సీట్ల నుంచి 243 కి వచ్చారని రేవంత్ ఎద్దేవా చేశారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Revanth reddy made interesting comments on the strengthening of bjp in telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com