CM Revanth Reddy: జూబ్లీహిల్స్ లో హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ మెజారిటీతో గెలుపును దక్కించుకుంది. నవీన్ యాదవ్ మాత్రమే కాదు.. ఈ గెలుపు ద్వారా రేవంత్ రెడ్డి కూడా బలోపేతం అయ్యారు. పార్టీ మీద పట్టు సాధించారు. ప్రభుత్వం మీద కూడా తన పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ద్వారా రేవంత్ రెడ్డి ఇకపై స్థానిక ఎన్నికల్లో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దూకుడుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో పోటీ చేయడానికి కంటే ముందు రెండు పర్యాయాలు నవీన్ యాదవ్ ఇక్కడ పోటీ చేశారు. రెండుసార్లు కూడా ఓడిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఒక రకంగా నవీన్ యాదవ్ కు వరుస ఓటముల తర్వాత దక్కిన విజయం ఇది.. మరోవైపు గులాబీ మీడియా, గులాబీ పార్టీ ఒత్తిడి, సొంత పార్టీలో ముసలం, సీనియర్ మంత్రుల ఇష్టారాజ్యం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయి.. జూబ్లీహిల్స్ విజయం ద్వారా దాదాపుగా ఇవన్నీ తగ్గిపోతాయి. అయితే రేవంత్ ఇకపై వేసే అడుగులు మొత్తం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇవన్నీ కూడా ఆయనను మరింత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంటాయి.
వాస్తవానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి.. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. రేవంత్ రెడ్డి ఒకరకంగా జీవన్మరణ సమస్యలాగా జూబ్లీహిల్స్ ఎన్నికలు తీసుకున్నాడు. ప్రచారం నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలోనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాడు.. క్షేత్రస్థాయిలో నివేదికను తెప్పించుకొని దానికి తగ్గట్టుగా అడుగులు వేశాడు.. అందువల్లే జూబ్లీహిల్స్ విజయం సాధ్యమైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ఒక మాట చర్చకు దారి తీస్తోంది. తెలుగులో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రధాన ఛానల్ ఒకటి రేవంత్ రెడ్డికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసింది. ఎన్నికల ఫలితాలు విడుదలతున్న క్రమంలో.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడింగ్ కొనసాగిస్తున్న క్రమంలో.. మూడో రౌండ్ కు సంబంధించి ఆ ఛానల్ లో వ్యతిరేకమైన వార్తలు వచ్చాయి. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఫలితాలు ఒక విధంగా ఉంటే.. ఆ చానల్ మరో విధంగా వార్తలను ప్రసారం చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. విలేకరుల సమావేశంలో అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు..
“రిజల్ట్ వస్తోంది.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అయినప్పటికీ ఛానల్ గులాబీ పార్టీ గెలవాలని కోరుకుంది. మూడో రౌండ్ ఫలితంలో ఓట్ల సంఖ్య ఒక విధంగా ఉంటే.. గులాబీ పార్టీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారంటూ ఆ ఛానల్ లో చెప్పారు. పైగా రెడ్ కలర్ ప్యాలెట్ లో బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పారు. అప్పుడు చూస్తుంటే టీవీ బద్దలైతుందేమో అనిపించింది.. వాస్తవం ఒక విధంగా ఉంటే.. మీరు చెప్పేది మరొక విధంగా ఉంది. ఇదేందని అడిగితే మాకు వచ్చిన సమాచారం అదే అని అంటున్నారు. మీడియా కూడా సొంత తీర్పులు ఇస్తే ఎలా అంటూ” రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఛానల్ పేరు ప్రస్తావించకుండానే.. పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆ ఛానల్ ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేసింది.. కొద్దిరోజులపాటు రేవంత్ రెడ్డి వార్తలను టెలికాస్ట్ చేయలేదు. చివరికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి శరణు జొచ్చింది..