Revanth Reddy kcr jagan
Revanth Reddy : ఏపీలో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరుకుంది. ఒకవైపు అధికారపక్షం, మరోవైపు కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. మరోవైపు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఏపీలో యుద్ధ వాతావరణం నెలకొంది. అటు దాయాది రాష్ట్రం తెలంగాణ నేతలు సైతం ఏపీ రాజకీయాల గురించి తరచూ మాట్లాడుతున్నారు. వేడి పెంచుతున్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారని తనకు సమాచారం ఉందని కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. కెసిఆర్ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మొన్న ఆ మధ్యన కెసిఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల గురించి, ఇక్కడ విజేత గురించి స్పందించాలని కోరడంతో ముక్తసరిగా మాట్లాడారు. ఏపీలో జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని తమకు సమాచారం ఉన్నట్లు కేసిఆర్ చెప్పుకొచ్చారు. దీనిపై పెను దుమారం రేగింది. కూటమిలోని మూడు పార్టీల నేతలు స్పందించారు. తెలంగాణలో కూడా ఇదే మాదిరిగా కెసిఆర్ చెప్పుకొచ్చారని.. కానీ గెలుపొందలేకపోయారన్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. కెసిఆర్ వైఖరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అయితే తాజాగా ఇదే అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కెసిఆర్ కు చంద్రబాబు అంటే అసూయ, ద్వేషం అని మండిపడ్డారు. ఆది నుంచి జగన్ తో కెసిఆర్ కు మంచి సంబంధాలే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ఏపీ రాజకీయాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఏపీ విషయంలో కాంగ్రెస్ క్లియర్ కట్ గా ఉందని.. ఏపీలో ఎన్ని సీట్లు సాధిస్తాం అన్నది ముఖ్యం కాదని.. పీసీసీ పగ్గాలు తీసుకున్న షర్మిల గట్టిగానే కొట్లాడుతున్నారని.. ఆమెకు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపాల్సిన అవసరం తమపై ఉందని రేవంత్ నొక్కి చెప్పారు. అయితే చంద్రబాబుపై కేసీఆర్ అసూయ ప్రదర్శిస్తున్నారని చెప్పడం ద్వారా.. రేవంత్ అసలు సిసలు సంకేతాలు ఇచ్చారు. శత్రువుకు శత్రువు తమకు మిత్రుడు అని.. శత్రువుకు మిత్రుడు తమకు శత్రువు అని స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు రేవంత్ రెడ్డి. మొత్తానికైతే ఏపీ రాజకీయాలు తెలంగాణలో సెగలు పుట్టిస్తున్నాయి.