Revanth Reddy Budget Crisis: తెలంగాణ ఖజానాకు మళ్లీ కొత్త కష్టాలు వచ్చేశాయి. “బడ్జెట్” అంటేనే రేవంత్ రెడ్డి గారికి భయం పట్టుకుందా? లేక ఆరు గ్యారెంటీల పేరుతో ఆకాశాన్ని తాకే హామీలిచ్చి, ఇప్పుడు వాటిని ఎలా నిలబెట్టుకోవాలో తెలియక తలపట్టుకుంటున్నారా? అన్న సందేహాలు సామాన్యుల్లో మొదలయ్యాయి. మార్చి 16న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే దాదాపు రూ. 3.25 లక్షల కోట్ల భారీ బడ్జెట్.. నిజంగా ప్రజలకు ఆనందాన్ని ఇస్తుందా? లేక అప్పుల భారంతో ఊపిరి సలపకుండా చేస్తుందా? అన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్.
Also Read: ‘స్పిరిట్’ నుండి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఇదేమి మాస్ బాబోయ్!
సంక్షేమం – “అప్పు”ల బండి!
చూడబోతే రేవంత్ సర్కార్ “అప్పులతోనే అభివృద్ధి” అనే కొత్త ఫిలాసఫీని నమ్ముకున్నట్లుంది. ఆదాయం ఏమో ఆశించిన స్థాయిలో పెరగడం లేదు, కానీ ఎన్నికల హామీల అమలుకు మాత్రం వేల కోట్లు కావాలి. దీంతో, మరో రూ. 60 వేల కోట్లు బహిరంగ మార్కెట్ నుండి అప్పు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
పాత అప్పుల వడ్డీలు, ఉద్యోగుల జీతాలకే ఖజానా ఖాళీ అవుతుంటే.. కొత్తగా వచ్చే అప్పులతో “మహాలక్ష్మి”, “రైతు భరోసా” హామీలను ఎలా నెరవేరుస్తారో వారికే తెలియాలి!
పింఛన్ల పెంపు.. “విడతల” మాయాజాలం!
ఇక అతిపెద్ద సవాలుగా మారిన పెన్షన్ల పెంపు విషయం. ఎన్నికల ముందు “వృద్ధులకు రూ. 4000, దివ్యాంగులకు రూ. 6000” అని గట్టిగా చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆర్ధిక భారం చూసి వెనక్కి తగ్గుతోంది. “వెంటనే పెంచితే తలకు మించిన భారమవుతుంది” అని గ్రహించి, “విడతల వారీగా” పెంచుతామని ఒక కొత్త ఫార్ములా తెరపైకి తెచ్చారు.
తొలి విడతలో కేవలం రూ. 500 పెంచాలని ప్లాన్ చేస్తున్నారట! అంటే, పెన్షన్ రూ. 4000 కావాలంటే లబ్ధిదారులు ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో! ఎన్నికల నాటికి హామీని నెరవేరుస్తామని చెప్తున్నా, ఈలోపు అప్పుల భారం సామాన్యుడిపై పన్నుల రూపంలో పడుతుందా? అన్నదే అసలు భయం.
ప్రతిపక్షం సైకిల్.. ప్రభుత్వం వాయిదా!
ఈ తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. “95 శాతం హామీలు అమలు కాలేదు” అంటూ లేఖలతో వేడెక్కిస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి గారికి నిద్ర కరువైంది. పన్నుల భారం వేయలేరు, హామీలను ఆపలేరు.. ఈ మధ్యలో బడ్జెట్ బండిని ఎలా లాగాలనేదే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ముందున్న ప్రధాన అగ్నిపరీక్ష.
చూస్తుంటే, రేవంత్ రెడ్డి గారికి ముందుంది ముసళ్ల పండుగలాగే కనిపిస్తోంది!