Revanth Reddy Assembly Speech: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్ మంత్రులతో కలిసే నిర్ణయాలు తీసుకుటున్నారు. ఢిల్లీకి వెళ్లినా ఒకరిద్దరు మంత్రలును తీసుకెళ్లడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. విదేశీ పర్యటనలకు కూడా మంత్రులు వెళ్తున్నారు. అయితే రెండున్నరేళ్లయినా సీఎం సత్తాను మంత్రులు సరిగా గుర్తించలేదు. కానీ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి తాజాగా తన రాజకీయ పటుత్వాన్ని, వాదనా చాతుర్యాన్ని ప్రదర్శించడంతోపాటు, ప్రతిపక్ష నేత హరీశ్ రావుపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించి గులాబీ శిబిరానికి ఊహించని షాకిచ్చారు. ఈ ఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ మంత్రులకు కూడా తమకు, సీఎంకు మధ్యనున్న నాయకత్వ అంతరాన్ని, రేవంత్ ’విలువ’ను స్పష్టంగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్‌లోని అంతర్గత సంఘర్షణ
ఇతర పార్టీల మాదిరిగా కాకుండా, కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన రాజకీయ సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. పార్టీలో సీనియర్ నేతలు ఎవరూ కూడా తమకంటే వయసులోనూ, అనుభవంలోనూ చిన్నవారైన రేవంత్ అధిక్యతను సులభంగా అంగీకరించలేకపోయారు. ఎన్నికల సమయంలో పది మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకోవడానికి ముందుకు రాని నేతలు, అధికారం వచ్చిన తర్వాత మాత్రం మంత్రి పదవుల కోసం పోటీపడ్డారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ చేతికే అధికార దండాన్ని అప్పజెప్పింది. ఇది ఆయన సామర్థ్యానికి నిదర్శనం.
అసెంబ్లీలో రేవంత్ వ్యూహాత్మక విజయం
మార్చి 28న(శనివారం) జరిగిన అసెంబ్లీ సమావేశాలు సీఎం సత్తాను మరోసారి నిరూపించాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై హరీశ్ రావు విరుచుకుపడిన సమయంలో, ఇతర మంత్రుల దగ్గర సరైన సమాధానాలు లేకపోయాయి. ఈ తరుణంలో రంగంలోకి దిగిన రేవంత్, హరీశ్ వాదనను పూర్తిగా ఖండించారు. కేవలం వాదనతోనే కాకుండా, సీబీసీఐడీ విచారణకు ఆదేశించడం ద్వారా ప్రతిపక్షాన్ని నిలువరించారు. ఇది ఆయన నిర్ణయ తీసుకునే సామర్థ్యాన్ని చాటిచెప్పింది. ఈ ఘటన తర్వాత, తాము కేవలం పాలనలో భాగస్వాములమే కానీ, నిజమైన నాయకుడు సీఎం మాత్రమేనని మంత్రులకు అర్థమైంది.
జాతీయస్థాయిలో గుర్తింపు..
రేవంత్ నాయకత్వ సామర్థ్యానికి ఇది కేవలం రాష్ట్రస్థాయి గుర్తింపు మాత్రమే కాదు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. 2025లో దేశంలోనే అత్యంత శక్తిమంతులైన 100 మంది జాబితాలో రేవంత్ రెడ్డికి 28వ స్థానం దక్కింది. గత ఏడాదితో పోలిస్తే 11 స్థానాలు మెరుగుపరచుకున్నారు. జాతీయ స్థాయిలో ఇండి కూటమిలో ఆయన పోషిస్తున్న కీలక పాత్ర, తెలంగాణలో తీసుకువచ్చిన సంస్కరణలే ఈ గుర్తింపుకు కారణం.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులు, మితిమీరిన ఆత్మవిశ్వాసం కాంగ్రెస్ విజయానికి కారణమయ్యాయని అంటారు. కానీ, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, అధికారాన్ని నిలబెట్టుకునే విషయంలో రేవంత్ కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రదర్శించిన పటుత్వం, సీనియర్ మంత్రులకు తమ ’విలువ’కు, సీఎం ’విలువ’కు మధ్యనున్న తేడాను స్పష్టంగా చూపించింది.