Telangana : ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలు తీరినట్టే..

ఖమ్మం, సూర్యాపేట జాతీయ రహదారి, హైదరాబాద్ జాతీయ రహదారి లింక్ అయ్యే చోట నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అయితే ఇప్పటివరకు ఖమ్మం నుంచి వెళ్తున్న వాహనాలు సూర్యాపేట హైవేపై ఎంట్రీ ఇచ్చేందుకు విజయవాడ వైపు రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అక్కడ యూటర్న్ తీసుకొని హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 2, 2024 12:50 pm
Follow us on

Telangana : ఆంధ్రకు సరిహద్దులో ఉన్న ఖమ్మం చాలా ప్రత్యేకమైనది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర సంస్కృతులతో ఈ ప్రాంతం విభిన్నంగా ఉంటుంది. ఈ ప్రాంతం మీదుగానే ఆంధ్రకు వెళ్లాల్సి ఉంటుంది. ఆంధ్ర వాసులు కూడా ఖమ్మం మీదుగానే హైదరాబాద్ వెళుతుంటారు.. వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లేవారు ఖమ్మం మీదుగా ప్రయాణం సాగిస్తుంటారు. ఇలా వెళ్లే వారి సంఖ్య రోజుకు వేలలోనే ఉంటుంది. రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులు రోజుకు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక ప్రైవేట్ వాహనాల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గాన్ని హైవేగా రూపాంతరం చెందించింది..ఖమ్మం – సూర్యాపేట మధ్యలో జాతీయ రహదారి నిర్మించింది. దీంతో కనెక్టివిటీ మరింత పెరిగింది. ఇదే సమయంలో ప్రయాణికులకు రాకపోకలు సాగించేందుకు అత్యంత సులువైన మార్గం ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే ప్రయాణికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఖమ్మం, సూర్యాపేట జాతీయ రహదారి, హైదరాబాద్ జాతీయ రహదారి లింక్ అయ్యే చోట నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అయితే ఇప్పటివరకు ఖమ్మం నుంచి వెళ్తున్న వాహనాలు సూర్యాపేట హైవేపై ఎంట్రీ ఇచ్చేందుకు విజయవాడ వైపు రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అక్కడ యూటర్న్ తీసుకొని హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రవేశం మార్గం దగ్గర ఫ్లై ఓవర్ నిర్మించకపోవడంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని బ్లాక్ స్పాట్ గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ స్పాట్ గా గుర్తించిన నేపథ్యంలో, ఫ్లై ఓవర్ మంజూరు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్లై ఓవర్ మంజూరు చేసింది.

ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ద్వారా ఆంధ్రా నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు మరింత సులువుగా ప్రయాణం సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను సాధ్యమైనంత తొందరలో ప్రారంభించేందుకు చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ అధికారులను కోరింది. ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ అధికారులకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి, సమస్య తీవ్రతను వెల్లడించారు. ఫ్లైఓవర్ నిర్మించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ స్పాట్ గా ఈ ప్రాంతాన్ని గుర్తించిన నేపథ్యంలో.. ఫ్లై ఓవర్ నిర్మించి ప్రమాదాల తీవ్రతను తగ్గించాలని వారు కోరారు.. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తమ కష్టాలు తీరుతాయని ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత తొందరలో ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరుతున్నారు. కాగా, ఈ హైవే నిర్మాణంతో ఇప్పటికే ఆంధ్ర, ఖమ్మం ప్రయాణికుల కష్టాలు తీరాయి. గతంలో ఈ రోడ్డు డబుల్ లైన్ మార్గంగా ఉండేది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. హైవే నిర్మాణం ద్వారా వారి ప్రయాణం మరింత సుఖవంతమైంది.