Kamareddy Heavy rains floods: సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భూపాలపల్లి జిల్లాలో కనివిని ఎరుగని స్థాయిలో వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ లో రెండు పిల్లర్లు కుంగిపోయాయి. దానికంటే ముందు లక్ష్మీ బ్యారేజీ లో మోటర్లు నీట మునిగాయి. పంప్ హౌస్ లోకి వరద బీభత్సంగా వచ్చింది. ఇసుక మేటలు వేసింది.. అప్పట్లో ఏకంగా భూపాలపల్లి జిల్లాలో 60 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ వరద వల్ల భూపాలపల్లి మాత్రమే కాకుండా ములుగు జిల్లా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పరకాల, కాలేశ్వరం, హనుమకొండ వెళ్లే దారులు మొత్తం ధ్వంసం అయ్యాయి. సరిగా ఇప్పుడు అలాంటి వర్షమే కామారెడ్డిలో కురిసింది. దీన్ని వర్షం అనకూడదు వరుణ దేవుడు కామారెడ్డి పై దూసిన జలఖడ్గం అని పేర్కొనవచ్చు.
కామారెడ్డి జిల్లాలోని మండలాలు, గ్రామాలలో కనివిని ఎరుగని స్థాయిలో వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం బుధవారం కూడా కురిసింది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలంలో గడచిన 14 గంటల్లో ఏకంగా 40 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందంటే అక్కడ పట్టుది ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా అక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెయిన్ ఫాల్ 55 నుంచి 60 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 2023లో భూపాలపల్లి జిల్లాలో 60 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటివరకు ఇదే రికార్డుగా ఉంది. కామారెడ్డి లో కురిసిన వర్షాలకు ప్రజలు బిక్కుబిక్కుమంటూ తాళం గడుపుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకు పోయింది. ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్ వరద వల్ల నీటిలో మునిగిపోయింది. అందులో చిక్కుకుపోవడంతో.. స్థానికులు కాపాడాలని వేడుకుంటున్నారు. ఇక ఇదే జిల్లా పరిధిలోని నాగిరెడ్డిపేటలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లోకి వరద నీరు వచ్చింది. విద్యార్థులను మెదక్ జిల్లా రామయంపేట మహిళా డిగ్రీ కాలేజీలోకి తరలించారు.
కోలుకోలేని నష్టం
రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడం వల్ల నష్టం అపారంగా ఉంది.. జిల్లా కేంద్రానికి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. పైగా కామారెడ్డిలో చాలావరకు ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియా చాలావరకు నీటి కుంటలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లను చేసింది. దీంతో వరద నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నీట మునిగిన ప్రాంతాలలో పెద్దపెద్ద భవనాలు కూడా ఉండడం విశేషం. నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో సెల్లార్లు పూర్తిగా మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గిపోతున్నారు. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.