Ramoji Rao: ఇప్పటికే ఏపీలో కార్యకలాపాలు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. తెలంగాణలో ఏర్పడింది అనుకూల ప్రభుత్వం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పటికైతే ఏపీలో పూర్వపు స్థాయిలో కార్యకలాపాలు సాగించే పరిస్థితి లేదు. ఇది చాలదన్నట్టు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా రిజర్వ్ బ్యాంక్ మాట్లాడింది. ఫలితంగా ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావుకు కష్టాలు మరింత చుట్టుముట్టినట్టు తెలుస్తోంది.
మార్గదర్శి సేకరించిన డిపాజిట్లు చట్ట విరుద్దమని ఆ మధ్య ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెక్షన్ 45 ఎస్ కు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిందని అభియోగాలు మోపింది. ” హైకోర్టులో ప్రతివాది కాకపోవడంతో అక్కడ ఈ విషయాలు చెప్పలేదని” ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది.. కేసు కోర్టు పరిధిలో ఉండగానే 2,000 కోట్లు వసూలు చేసిందని.. ఇంతకుముందు చట్ట విరుద్ధంగా 2,600 కోట్లు సేకరించిందని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇన్ని రోజులు తాము నిబంధనలు ఉల్లఘించలేదంటూ మార్గదర్శి సంస్థ చెబుతూ వస్తోంది.. సుప్రీంకోర్టులో కూడా మార్గదర్శి అదే విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించగా.. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్ యూ ఎఫ్) పేరు మీద డిపాజిట్లు సేకరించడం సెక్షన్ 45 ఎస్ కు విరుద్ధమని రిజర్వ్ బ్యాంకు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ కేసులో మార్గదర్శి డిపాజిట్ల సేకరణ కూడా అలాగే జరిగిందని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు న్యాయవాది రమేష్ బాబు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.. అన్ని వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. పూర్తి వివరాలతో ఒక నోట్ తమ ముందు ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంతో పాటు పిటీషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం మార్గదర్శి డిపాజిట్ ల సేకరణ విషయంలో నోట్ తమ ముందు ఉంచాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె వి విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
మార్గదర్శి సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. వసూలు చేసిన డిపాజిట్లు చాలా వరకు తిరిగి వెనక్కి ఇచ్చేశామన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఉమ్మడి హైకోర్టు మార్గదర్శిపై సిఐడి నమోదు చేసిన ఫిర్యాదును కొట్టివేసిందన్నారు. అసలు ఈ కేసుతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అప్పుడు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి మార్గదర్శి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం కోర్టుకు వచ్చే సమయానికి నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్లు సేకరించిందని పేర్కొన్నారు.
ఈ కేసులో పార్టీ ఇన్ పర్సన్(కేసు దాఖలు చేసిన వ్యక్తి తన వాదనలను తానే వినిపించడం) గా ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు. “తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చారా? ఎవరిచ్చారు? ఎవరికిచ్చారు? అనే విషయాలు ముఖ్యం కాదు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అదే ఇక్కడ చూడాల్సిన అంశమని” ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు న్యాయవాది హెచ్ యూఎఫ్ గా సెక్షన్ 45 ఎస్ ప్రకారం డిపాజిట్లు సేకరించడం ఆర్బిఐ చట్టనిబంధనలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఏప్రిల్ 9 కి విచారణను వాయిదా వేసింది. ఆనాటితో ఈ కేసు విషయంలో ఒక స్పష్టత వస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు న్యాయవాది కీలక విషయాలు చెప్పడంతో మార్గదర్శి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించడానికి ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. అయితే తాజా పరిణామం మార్గదర్శికి ప్రతి బంధకంగానే ఉన్నట్టు సమాచారం. ఏప్రిల్ 9 నాడు న్యాయవాదులు వాదించిన దాని బట్టే మార్గదర్శి భవితవ్యం ఆధారపడి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.