JNTUH Campus : చట్నీలో పరుగులు పెడుతున్న ఎలుక.. ఇవీ మన ప్రభుత్వ హాస్టళ్లు.. జేఎన్టీయూహెచ్ క్యాంపస్ లు

JNTUH Campu కూరగాయలను కడకుండానే వండటం, నాణ్యత లేని ఆహార పదార్థాలను ఉపయోగించి వంటలు చేయడం వంటి దృశ్యాలు కనిపించాయి. గిన్నెలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం.. బూజు పట్టిన మసాలాలు, అల్లం పేస్ట్ వాడటాన్ని విద్యార్థులు గమనించారు. దీంతో ఆ దృశ్యాలను వారు తమ ఫోన్ లలో బంధించారు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు

Written By: NARESH, Updated On : July 9, 2024 8:53 pm

Rat in JNTUH Campus Hostel Chutney

Follow us on

JNTUH Campus : అమ్మానాన్నలకు దూరంగా.. అయిన వాళ్లను వదిలిపెట్టి.. ఉన్నత చదువులు చదివేందుకు చాలామంది హైదరాబాద్ వస్తుంటారు.. ఇందులో పేద, మధ్య తరగతికి చెందినవారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుతుంటారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ విశ్వవిద్యాలయాలకు కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉండడంతో.. విద్యా బోధన దగ్గర నుంచి మొదలు పెడితే.. భోజనం వరకు ప్రతిదాంట్లో నాణ్యత అంతగా ఉండదు. బయట ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో చదివే స్తోమత లేక.. ప్రైవేట్ హాస్టల్లో ఉండేందుకు ఆర్థిక వెసలు బాటు లేక చాలామంది ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అసౌకర్యాల మధ్య చదువుతుంటారు. విశ్వవిద్యాలయాల్లో పెట్టే భోజనం అత్యంత నాసిరకంగా ఉంటుందని తెలిసినప్పటికీ.. అందులో ఎలుకలు కూడా ఉంటున్నాయని.. విద్యార్థులకు వడ్డించే చట్నీలో పరుగులు పెడుతున్నాయని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ద్వారా తెలుస్తోంది.

సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హెచ్ క్యాంపస్ లో చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ఉండే విద్యార్థులకు మెస్ లో భోజనం తయారు చేసి వడ్డిస్తుంటారు. అయితే విద్యార్థులకు టిఫిన్ పెట్టే క్రమంలో తయారుచేసిన చట్నీలో ఎలుక కనిపించడం కలకలం రేపింది. కొంతమంది విద్యార్థులు చట్నీని పరిశీలించగా.. అందులో ఒక ఎలుక ఈత కొడుతూ దర్శనమిచ్చింది. దీంతో ఆ విద్యార్థులు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త చర్చకు దారి తీసింది. గత కొద్దిరోజులుగా మెస్ లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలలో నాణ్యత లేకపోవడం, వాసన వస్తుండడంతో కొంతమంది విద్యార్థులు పరిశీలించేందుకు మెస్ లోకి వెళ్లారు. దీంతో వారికి అక్కడ భయానక దృశ్యాలు కనిపించాయి.

కూరగాయలను కడకుండానే వండటం, నాణ్యత లేని ఆహార పదార్థాలను ఉపయోగించి వంటలు చేయడం వంటి దృశ్యాలు కనిపించాయి. గిన్నెలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం.. బూజు పట్టిన మసాలాలు, అల్లం పేస్ట్ వాడటాన్ని విద్యార్థులు గమనించారు. దీంతో ఆ దృశ్యాలను వారు తమ ఫోన్ లలో బంధించారు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.”ప్రజాప్రతినిధులు ఇలాంటి తిండి తింటున్నారా. వారి పిల్లలు కూడా ఇలాంటి ఆహార పదార్థాలను భుజిస్తున్నారా? విద్యార్థులకు వడ్డించే చట్నీలో ఎలుక అలా కనిపిస్తే ఎలా తింటారు? పేద, మధ్యతరగతి విద్యార్థులు అంటే ప్రభుత్వానికి లెక్క లేదా? ఇదేనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రజా పరిపాలన” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.