Team India Coach : టీమ్ ఇండియా కోచ్ ఎవరు? ఈ ప్రశ్న ఇన్నాళ్ళూ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. కానీ దానికి తెర దించుతూ.. బీసీసీఐ సెక్రటరీ జై షా మంగళవారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు.. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఒక అప్డేట్ ఇచ్చారు. “అతనికి స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం వేగంగా మార్పులకు గురవుతున్న ఆధునిక క్రికెట్ ను ఆయన దగ్గరగా చూశారు. ఆయన తన కెరియర్ లో ఎన్నో విభాగాలలో రాణించారు. భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఆయనపై నాకు నమ్మకం ఉంది. గౌతమ్ గంభీర్ కొత్త ప్రయాణానికి బీసీసీఐ నుంచి పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందని” జై షా పేర్కొన్నారు. ఇదే క్రమంలో టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారని జై షా చెప్పకనే చెప్పేశారు. దీంతో రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా కోచ్ ఎవరు అనే ప్రశ్నకు జై షా సమాధానం చెప్పారు.. శ్రీలంక టోర్నీతో గౌతమ్ గంభీర్ టీమిండియాలో జాయిన్ అవుతారని జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
టీమిండియాలో గౌతమ్ గంభీర్ సీనియర్ క్రికెటర్. టీమిండియా 2007 t20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ సాధించిన సమయంలో గౌతమ్ గంభీర్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో సత్తా చాటాడు. ముక్కుసూటి వ్యక్తిగా.. దూకుడైన వ్యక్తిత్వం ఉన్న ఆటగాడిగా గౌతమ్ గంభీర్ కు పేరుంది. ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించినప్పుడు.. ఆ జట్టును విజేతగా నిలిపాడు గౌతమ్ గంభీర్. ఆ తర్వాత ఆ జట్టు మరోసారి విజేతగా నిలవలేకపోయింది. కోల్ కతా జట్టుకు ఇటీవలి ఐపీఎల్ లో గౌతమ్ గంభీర్ మెంటర్ గా వ్యవహరించాడు.. ఆ జట్టును తిరుగులేని స్థాయిలో నిలిపాడు. ఫలితంగా కోల్ కతా జట్టు ఐపిఎల్ విజేతగా ఆవిర్భవించింది. వాస్తవానికి కోల్ కతా జట్టుకు మెంటర్ గా వ్యవహరించేందుకు గౌతమ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగాడు. గౌతమ్ గంభీర్ రాకతో కోల్ కతా పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఆ జట్టు ఆటగాళ్లు అన్ని విభాగాలలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించారు. ఫలితంగా ఐపీఎల్ విజేతగా నిలిచారు..
ఐపీఎల్ లో కోల్ కతా జట్టును గౌతమ్ గంభీర్ విజేతగా తీర్చిదిద్దడంతో.. బీసీసీఐ సెక్రెటరీ జై షా అప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించడం మొదలుపెట్టాడు. కోల్ కతా జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందిస్తున్న సమయంలో సంప్రదింపులు జరిపాడు. అప్పట్లో ఇవి సఫలీకృతం కాకపోయినప్పటికీ.. జై షా పలుమార్లు గౌతమ్ గంభీర్ ను కలిశాడు. చివరికి కోచ్ గా వచ్చేలా ఒప్పించాడు. వాస్తవానికి బీసీసీఐ కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూకు రామన్ కూడా హాజరయ్యాడు. కానీ చివరికి బీసీసీఐ సెలక్షన్ కమిటీ గౌతమ్ గంభీర్ వైపే మొగ్గు చూపింది.
Many thanks for your extremely kind words and constant support @JayShah bhai. Elated to be a part of this journey! The entire team together will strive for excellence and newer heights. https://t.co/BgAbTwN59u
— Gautam Gambhir (@GautamGambhir) July 9, 2024