Hydra: విశ్వనగరం హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా మార్చాలన్న సంకల్పంతో ఉన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందుకు ముందుగా నగరానికి ముంపు ముప్పు తప్పించాలని భావిస్తున్నారు. చిన్న వర్షం పడినా రోడ్లు చెరువులను తలపించే పరిస్థితి మారాలన్న లక్ష్యంతో హైడ్రా ఏర్పాట చేశారు. హైదరాబాద్‌లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను కాపాడడంతోపాటు, చెరువులు, కుంటలను రక్షించడం, ప్రజలను విపత్తు నుంచి కాపాడడం దీని లక్ష్యం. ప్రస్తుతం ప్రధానంగా చెరువులు, కుంటలను పునరుద్ధరించే పని చేపట్టింది హైడ్రా, కమిషనర్ రంగనాథ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎవరి ఒత్డికీ తలొగ్గకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. వ్యూహాత్మకంగా ఆక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను పంపుతున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా చెరువులు, కుంటల భూమిని రికవరీ చేశారు. ఇక కోర్టు కూడా హూడ్రా విషయంలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. చాలా మంది కోర్టును ఆశ్రయిస్తుండడంతో హైడ్రాకు సీఎం మరిన్ని అధికారాలు అప్పగించడంతోపాటు చట్ట బద్ధత కల్పించేలా చర్యలు చేపడుతున్నారు.
హద్దులు చెరిపిన అధికారులు..
ఇక ఆక్రమిత స్థలాల్లో అనుమతులు ఇచ్చిన అధికారులపైనా హైడ్రా కమిషనర్ చర్యలకుదిగుతున్నారు. ఇప్పటికే ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు అధికారులు చెరువులు, కుంటల హద్దులను తప్పుగా చూపించే ప్రయత్నం మొదలు పెట్టారు. హద్దులను కొత్తగా చూపించే మ్యాప్‌లు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆక్రమణదారులకు రక్షనతోపాటు, తమకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. కానీ, రంగనాత్.. అంతకు మించి ఆలోచన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో 45 ఏళ్లనాటి ఉపగ్రహ చాయాచిత్రాలు సేకరించే పనిలో పడ్డారు. ఈమేరకు హైడ్రా, ఎస్‌ఆర్‌ఎస్సీ మధ్య త్వరలోనే ఒప్పందం జరుగనుంది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే.. నగరంలో ఉన్న అరకొర చెరువులు కూడా మిగలవ్న భావనలో ప్రభుత్వం కూడా ఉంది. ఉన్న చెరువులను కాపాడేలా హైడ్రా చర్యలు చేపడుతోంది.
ఎస్‌ఆర్‌ఎస్సీ కేంద్రం సందర్శన..
గతలో చెరువులు, కుంటలు ఎలా ఉండేవో తెలిసేలా మ్యాప్‌లు కావాలని రంగనాథ్ ఇటీవల ఎస్‌ఆర్‌ఎస్సీ అధికారులను కోరారు. ఇటీవల బాలానగర్‌లోని కేంద్రాన్ని సందర్శించారు. శాస్త్రవేత్తలతో మాట్లాడారు. చెరువుల సంరక్షణకు ఎస్‌ఆర్‌ఎస్సీ సాయం కోరారు. చెరువుల హద్దులను చూపించే స్పష్టమైన పటాలు ఇవ్వాలని కోరారు. దీంతో హద్దులు చెరిపేసినా గుర్తించే వీలుంటుందని తెలిపారు. అధికారికంగా మ్యాప్‌లు కొంటామని తెలిపారు.
56 చెరువుల పటాలు రెడీ..
ఇదిలా ఉంటే ఎస్‌ఆర్‌ఎస్సీ సంస్థ ఇప్పటికే హైడ్రాకు 56 చెరువుల పటాలు అప్పగించింది. 1979 నుంచి 2023 మధ్య చెరువులు ఎలా ఆక్రమణకు గురయ్యాయో చూపేలా చిత్రాలు ఉన్నాయని తెలుస్తోంది. అనేక చెరువులు కొన్ని రోజుల్లోనే కనుమరుగైనట్లు గుర్తించారు. ఆయా పటాలు మరింత పక్కాగా సేకరించి హద్దులు నిర్ణయించాలని రంగనాథ్ భావిస్తున్నారు.