Congress : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టింది. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీ అయ్యింది. ఇటీవల పాదయాత్ర పూర్తి చేసుకొని ఖమ్మం సభతో కాంగ్రెస్ లో జోష్ నింపిన మల్లు భట్టికి అభ్యర్థుల ఎంపికలో కీలక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. రాహుల్ తోపాటు గన్నవరం వరకూ వెళ్లిన భట్టికి రేవంత్ సహా సీనియర్లతో కలిసి ఈ కీలక బాధ్యతలను ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను రాహుల్ గాంధీ కోరినట్లు తెలుస్తోంది. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బతినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు.
మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు తెలిసింది. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది. ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో టికెట్లు ఖరారు చేయటం వలన ప్రతీ సారి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సారి ఎన్నికలకు ముందుగానే క్లారిటీ ఉన్న నియోజకవర్గాల్లో వచ్చే నెలలోనే టికెట్లు ఖరారు చేసే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
పోటీ ఉన్న నియోజకవర్గాల్లోనూ అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికలకు మూడు నెలల ముందుగానే విడదుల చేసేందుకు రాహుల్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీని ద్వారా చివరి నిమిషం లో సీట్ల కోసం వివాదాలు నివారించవచ్చని, అభ్యర్థుల ప్రచారానికి సమయం ఎక్కువగా ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. ఈ సమయంలో భట్టి నుంచి రాహుల్ నివేదిక కోరటంతో అభ్యర్థుల ఎంపికలో భట్టి విక్రమార్క్ చేసే సూచనలు, ఇచ్చే నివేదిక పార్టీ అభ్యర్థుల ఖరారులో కీలకంగా మారనుంది.