లాక్‌డౌన్ 4.0లో కేంద్రం రిలీజ్ చేసిన గైడ్‌లైన్స్‌లో అంతర్రాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దంటూ సూచించింది. ఆంక్షలు విధిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది. దీంతో తెలంగాణ–ఆంధ్ర మధ్య ఆంక్షలు తొలిగి ఆర్టీసీ బస్సులు ప్రారంభం అవుతాయని అందరూ భావించారు. అయితే.. తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఎలాంటి ఆంక్షలైతే కొనసాగడం లేదు. కానీ.. ఇంతవరకైతే సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు సమస్య ఎక్కడ ఉందనేది సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువ సర్వీసులు తమవే అంటే తమవే ఉండాలంటున్న ఇరురాష్ట్రాల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. అయితే ఈ చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్లు లబ్ధి పొందుతున్నారు.
Also Read: ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి
రోజులు గడుస్తున్న కొద్దీ తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నాయి. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఈ రెండు ప్రభుత్వాల వ్యవహారం ‘పుండు మీద కారం చల్లినట్లు’గా తయారైంది. ఆర్టీసీ బస్సుల ఎలాగూ నడుస్తలేవు కాబట్టి ప్రైవేటు సర్వీసుల వారు ఆర్థికంగా బలపడుతున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి తెలంగాణకు 150 ప్రైవేటు బస్సుల సేవలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు తన్నుకుపోతున్నా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు.
ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యపై ఇప్పటికే చాలా సార్లు ఆర్టీసీ పెద్దలు సమావేశం అయ్యారు. ఎండీల స్థాయిలోనూ చర్చలు జరిపారు. అయినా కొలిక్కి రాలేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అయితే సమ్మె పోటు నష్టాన్నే ఇంకా పూడ్చుకోలేకపోతోంది. మే 19 నుంచి హైదరాబాద్ మినహా.. జిల్లాల్లో బస్సుల సేవలు పునఃప్రారంభమయ్యాయి. వస్తున్న రాబడి డీజిల్, ఇతర నిర్వహణ పనులకే సరిపోతోంది. ప్రతినెలా ఉద్యోగులకు వేతనాలివ్వాల్సి వచ్చినప్పుడు సంస్థ దిక్కులు చూస్తోంది. నిజానికి హైదరాబాద్ సిటీ బస్సులు, జిల్లా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే అంతర్రాష్ట్ర సర్వీసుల వల్ల వచ్చే రాబడే ఎక్కువ.
ఇరు ప్రభుత్వాలు స్పందించి అంతర్రాష్ట్ర సర్వీసులను ఎంత తర్వగా ప్రారంభిస్తే.. సంస్థలకు అంత ఊరిట లభిస్తుందని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీ బస్సులు తెలంగాణలో 2.62 లక్షల కిలోమీటర్లు, తెలంగాణ బస్సులు ఏపీలో 1.52 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. తెలంగాణ కంటే ఏపీ 1.11 లక్షల కిలో మీటర్లు ఎక్కువ నడుపుతోందని, బస్సుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని, వీటిని తగ్గించుకోవాలంటూ టీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. దీనికి ఏపీ అధికారులు 52 వేల కిలోమీటర్లను తగ్గించుకుంటామని, తెలంగాణ ఆర్టీసీ మరో 50 వేల కిలోమీటర్లు పెంచుకోవచ్చని చెప్పారు.
Also Read: ఏపీ మంత్రి కొడుక్కి బెంజ్ కారు లంచమా?
ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు 4.04 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఏపీ ప్రతిపాదన అమలైతే.. ఏపీ 2.12 లక్షల కిలోమీటర్లు, తెలంగాణ 1.92 లక్షల కిలోమీటర్ల మేరకు బస్సులను నడపవచ్చు. కిలోమీటర్లలో ఏమాత్రం తేడా రాదు. ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. కానీ.. దీనికి తెలంగాణ అందుకు ఒప్పుకోవడం లేదు. 1.11 లక్షల కిలోమీటర్లు తగ్గించుకుంటేనే.. ఒప్పందం చేసుకుంటామని పట్టుదలతో ఉంది. అదే జరిగితే రెండు రాష్ట్రాల్లో తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసులు 3.04 కిలోమీటర్లకే పరిమితమవుతాయి. దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా ప్రైవేటు ఆపరేటర్లు ఆ లక్ష కిలోమీటర్లను భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇది ఇరు ఆర్టీసీలకు నష్టమే. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల సీఎంలు జోక్యం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపితే అటు ప్రయాణికుల కష్టాలతోపాటు ఇటు ఆర్టీసీ సంస్థల కష్టాలూ తీరనున్నాయి.