HomeతెలంగాణPM Modi : తెలంగాణకు మోడీ.. మార్పు జరిగితే కమలంలో కల్లోలమే

PM Modi : తెలంగాణకు మోడీ.. మార్పు జరిగితే కమలంలో కల్లోలమే

PM Modi :  కర్ణాటక ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఉండేది. ప్రజల సమస్యలపై వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేది. మునుగోడు లాంటి ఉప ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కి జనాల్లో ఉన్న చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోయిందో అప్పుడే తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో లుకలుకలు బయట పడడం ప్రారంభమైంది. ఇక అప్పటినుంచి పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది.. భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం తానే అని ప్రచారం చేస్తున్న పార్టీ.. ప్రస్తుతం మూడవ స్థానంలోకి పడిపోయింది. దాని స్థానంలోకి కాంగ్రెస్ అనూహ్యంగా వచ్చి చేరింది. ఇప్పుడు వీటిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలని మోదీ సంకల్పించుకున్నారు. స్వామి కార్యం సౌకర్యాన్ని నెరవేర్చుకునే క్రతువులో భాగంగా త్వరలో తెలంగాణలో ఆయన పర్యటించనున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మోది తో పాటు 40 మంది నియోజకవర్గస్థాయి నాయకులు సమావేశంలో పాల్గొంటారని, వారి సలహాలు సూచనలను మోడీ స్వీకరిస్తారని తెలుస్తోంది. ఇక మోడీ పర్యటన నేపథ్యంలో అధ్యక్షుడి మార్పు జరుగుతుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే వెంటనే అధ్యక్షుడిని మార్చితే రాష్ట్ర వ్యాప్తంగా పెను సంక్షోభం తప్పదని పార్టీ సీనియర్లు అంటున్నారు. ఇదే విషయం మీద వారు జాతీయ నాయకత్వానికి ఒక లేఖ కూడా రాశారు. “సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంచుకుంది. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. సమయంలో అధ్యక్షుడిగా ఆయనకు ఒక్కసారి కూడా శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం? బహిరంగ సభలో శభాష్ బండిజి అని పలుమార్లు మెచ్చుకున్నారు. సందర్భాల్లో మీరే అతడిని మార్చివేస్తే ఎలా ఉంటుంది” అని వారు లేఖలో పేర్కొన్నారు.
సారధ్య మార్పు జరిగితే..
“సారథ్య మార్పు జరిగితే ఇతర పార్టీల నుంచి వచ్చే వారి సంగతేమోగానీ, పార్టీలో ఉన్నవాళ్లు కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటారు. తమ నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న ఆరుగురు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు తిరిగి అదే పార్టీలోకి వెళ్లడం ఖాయం. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అన్న ప్రచారం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లింది. సంజయ్‌ పోరాటాలతో ఈ ప్రచారానికి కొంత వరకు అడ్డుకట్ట వేయగలిగాం. ఇప్పుడు ఆయన్ను మారిస్తే, మేం ఇన్నాళ్లు చేసిన పోరాటాలు ఏమవుతాయి? వందలాది మంది నాయకులు, కార్యకర్తలపై వేలాది కేసులు నమోదయ్యాయి? వందల మంది జైళ్లకు వెళ్లారు.. వారిపై నమోదు చేసిన కేసులు ఏమవుతాయి? కొత్త అధ్యక్షుడొస్తే వారిని పట్టించుకుంటారన్న గ్యారంటీ ఏమిటి..?’’ అని లేఖలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాలని నేతలు విజ్ఞప్తి చేశారు.
అంతకంటే దారుణమైన తప్పిదం మరొకటి ఉండదు
సంజయ్‌కి ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తే రాష్ట్ర పార్టీకి అంతకంటే ఆత్మహత్యా సదృశం ఇంకోటి ఉండబోదని తేల్చి చెప్తూ బీజేపీ సీనియర్‌ నేత విజయరామారావు… అధినాయకత్వానికి లేఖ రాశారు. మరో వైపు పార్టీ సీనియర్‌ నేత ఏపీ జితేందర్‌రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్‌ చేసి మాట్లాడారు. జితేందర్‌రెడ్డి గురువారం చేసిన ట్వీట్‌ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు నడ్డా కార్యాలయం నుంచి జితేందర్‌రెడ్డికి ఫోన్‌ వచ్చింది.. కాసేపు సరదా సంభాషణ అనంతరం.. పార్టీని డ్యామేజ్‌ చేసే వారినుద్దేశించి మాత్రమే ట్వీట్‌ చేసినట్లు జితేందర్‌రెడ్డి పేర్కొన్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, నడ్డా నుంచి తనకు ఫోన్‌ రాలేదని జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు.. జితేందర్‌రెడ్డి ట్వీట్‌పై ఈటల రాజేందర్‌ స్పందించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు వయస్సు పెరిగిన కొద్దీ జాగ్రత్తగా ఉండాలని, ఒకరి గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడాలని పరోక్షంగా జితేందర్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. మరో వైపు  బీజేపీ జాతీయ నాయకత్వం తన విషయంలో అనుసరిస్తున్న వైఖరి పట్ల ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఎవరి స్వార్థం వారిదేనని అన్నారు. బీజేపీకి ఫ్లోర్‌లీడర్‌ లేకపోవడం విస్మయం కలిగించే అంశం కాదా? అంటూ రెండు రోజుల క్రితం జేపీ నడ్డాకు ఆయన ఫిర్యాదుచేశారు.‘
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version