Telangana Assembly Elections: ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావొచ్చని పార్లమెంట్‌తోపాటు మే నెలలో జరిగినా ఆశ్చర్యం లేదు’ ఇదీ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సెప్టెంబర్ 12న చేసిన వ్యాఖ్యలు ఇవీ. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. మినీ జమిలీ ఎన్నికల కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే.. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆగిపోతాయి. వచ్చే ఏడాది మేలో లోక్‌సభతోపాటు మరికొన్ని రాష్ట్రాలు కలిపి ఎన్నికలు జరుగుతాయి.
జనవరిలో 17న లాస్ట్ డే..
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలం జనవరి 17తో ముగుస్తుంది. ఆ తర్వాత ప్రజాప్రతినిధులే ఉండరు. ప్రభుత్వం అనే మాటే రాదు. ఆపద్ధర్మ సీఎం అనే మాట వినిపించే అవకాశం లేదు. రాజ్యాంగ సవరణలో ప్రభుత్వ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ ఏమైనా మార్పులు చేస్తే.. అప్పుడు అవకాశం ఉండొచ్చు. కానీ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వాన్ని కొత్తగా చేసే సవరణ ద్వారా పొడిగించడం ఎలా సాధ్యమన్న సందేహం ఎవరికైనా వస్తుంది.
రాష్ట్రపతి పాలనే..
ఇలాంటి పరిస్థితి వస్తే ఎక్కువగా అవకాశం ఉన్న చాయిస్..రాష్ట్రపతి పాలన. ఇది బీజేపీకి కూడా కలిసి వస్తుంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ప్రస్తుతం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తే కేంద్ర పాలన వచ్చినట్లే. ఎన్నికలకు ఇది అడ్వాంటేజ్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విదిస్తే సీన్ మారిపోతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరు అన్న ఊహను బీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేయలేవు. అధికార పగ్గాలు కేసీఆర్ చేతుల్లో లేకుండా ఐదారు నెలలు కేంద్ర పాలన సాగిందంటే ఎన్నో రకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనధికారికంగా బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. బీజేపీ కోరుకుంటే ఇదే చేయగలదు.
బీఆర్‌ఎస్‌పై తీవ్ర ప్రభావం..
రాజ్యాంగ సవరణ జరిగి ఎన్నికలు వాయిదా పడిదే దాని ప్రభావం బీఆర్‌ఎస్‌పై తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పథకాలన్నీ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకే అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసులు కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ అరెస్టులు, అణచివేతలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి పాలన వస్తే ఇవన్నీ మారుతాయి. పథకాలకు ఎంపికైన జాబితా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. పోలీస్‌తోపాటు ప్రభుత్వ యంత్రాంగమంతా కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. దీంతో మళ్లీ ఎంపిక చేస్తే.. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు నష్టం తప్పదు. ఇక ఇప్పుడు ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ అధికారుల బదిలీలు పూర్తి చేసింది. ఇందులో 90 శాతం తమకు అనుకూల అధికారులనే నియోజకవర్గాలు, జిల్లాల్లో నియమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు నిలిచిపోతే.. రాష్ట్రపతి పాలన వస్తే మళ్లీ బదిలీలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు బీజేపీకి అనుకూలంగా బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలా అనేక రకాలుగా బీఆర్‌ఎస్‌కు నష్టం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.