Prashant Kishor meets with Kavitha: రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రాజకీయ నాయకులు ఒక విధంగా ఎప్పుడూ ఆలోచించరు. ఒకప్పుడు సంప్రదాయ రాజకీయాలు కొనసాగేవి. మెజారిటీ నాయకులు విలువలు పాటించేవారు. వాటికి తగ్గట్టుగానే రాజకీయాలు సాగించేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సొంత కుటుంబంలో ఉన్నవారు సైతం ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. అంతిమంగా అధికారం కోసం ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. జగన్, షర్మిల, కవిత, కేటీఆర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు..
తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. కాకపోతే ఆ పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నారు జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. రాజకీయంగా మరింత బలోపేతం అవడానికి కవిత అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే జాగృతి ఆధ్వర్యంలో దాదాపు 50 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రజల కోసం ఇటీవల కాలంలో యాత్ర కూడా నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు నుంచి మొదలుపెడితే ఖమ్మం వరకు కవిత యాత్ర కొనసాగించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. గడచిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది అంతంతమాత్రంగానే సాగిందని.. దోపిడి పర్వం యదేచ్చగా నడిచిందని కవిత పేర్కొన్నారు. తన తండ్రి పరిపాలన సంబంధించి చోటు చేసుకున్న లోటుపాట్లను బయటపెట్టే విషయంలో కవిత ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. కవితలో ఈ ధైర్యం నుంచి చాలామంది నాయకులు ఆమె వెంట నడవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని జాగృతి నాయకులు చెబుతున్నారు.
కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఖాయమని జాగృతి నేతలు అంటున్నారు. ఇటీవల కవిత కూడా పరోక్షంగా అదే వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత రెండు నెలల వ్యవధిలో పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో వరుసగా సమావేశమైనట్టు తెలుస్తోంది. సంక్రాంతి రోజు కూడా వీరిద్దరూ భేటీ అయ్యారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు.. ప్రజల పార్టీగా దానిని రూపొందించడం.. ప్రజల కోణంలో ఎలా పనిచేయాలని అంశంపై.. సుదీర్ఘంగా కవిత ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు జరిగినట్టు సమాచారం. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే కవిత దాదాపు 50 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీల ద్వారా ప్రజల సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సంబంధించి స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు జాగృతి నేతలు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇటీవల జన్ సూరజ్ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, బీహార్ ప్రజల మన్ననలు పొందలేకపోయారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో తన సత్తా చూపిస్తారా? కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిని చేస్తారా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. మరోవైపు, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గులాబీ పార్టీ కోసం పనిచేశారు. దేశవ్యాప్తంగా గులాబీ పార్టీని విస్తరించడానికి సలహాలు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఎందుకనో గులాబీ పార్టీ ప్రశాంత్ కిషోర్ ను దూరం పెట్టింది.
