Ponguleti Srinivasa Reddy: పలువురు మంత్రులు, మీడియా ప్రతినిధులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో హాన్ నది పునర్జీవనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. ఈ సందర్భంగా పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు..”ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలో రాజకీయపరంగా బాంబులు పేలుతాయి.. అవి పెను విస్పోవడానికి దారి తీస్తాయి. ప్రధాన నేతలకు షాక్ ఇచ్చే పరిణామాలు జరుగుతాయి.. దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద అన్ని సాక్షాలు ఉన్నాయి. ఫైలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మేము సియోల్ నుంచి హైదరాబాద్ వెళ్లే లోపే ఈ చర్యలు మొదలవుతాయి. ఇది కక్ష సాధింపు కాదు. పూర్తి ఆధారాలున్నాయి. వాటి ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పు చేసింది ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు. భూమికి సంబంధించిన హక్కులపై సామాన్య రైతుల నుంచి పెద్ద వ్యక్తుల వరకు ఎవరు ఎటువంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదు. అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కొత్త ఆర్వో ఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నాం. కొత్త చట్టం ప్రజలకు అనుకూలంగా ఉంటుంది.. లక్షల మంది రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. 15 దేశాలలో అమల్లో ఉన్న రెవెన్యూ విధానాలను అధ్యయనం చేసి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించాం.. ఈ ముసాయిదా కు సంబంధించి రైతులు, మేధావులు, సామాన్యుల నుంచి అభిప్రాయాలు తీసుకుని చట్టాన్ని రూపొందించామని” పొంగులేటి పేర్కొన్నారు.
వారిపై చర్యలు తీసుకుంటారా?
బుధవారం వయనాడ్ పార్లమెంటు స్థానానికి ప్రియాంక గాంధీ నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లారు. వారు అక్కడ ఉండగానే పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ కమిటీ సంచలన విషయాలను వెల్లడించడం.. భూదాన్ భూములపై అప్పటి రంగారెడ్డి – మేడ్చల్ కలెక్టర్ ఆమోయ్ కుమార్ ను ఈడీ విచారించడం.. వంటి పరిణామాలు జరుగుతుండగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రకారం చేసుకుంటే ప్రభుత్వం కాలేశ్వరం, ఇతర అవకతవకలపై చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పదేపదే కాలేశ్వరం విషయాన్ని ప్రస్తావించే వారు. అందులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేశ్వరంపై విచారణను వేగవంతం చేశారు. అయితే కొద్ది రోజులు విచారణ నెమ్మదించిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్లీ విచారణను వేగవంతం చేశాయి. మొత్తంగా బిఆర్ఎస్ పెద్దలను ఇరికించేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పొంగులేటి సియోల్ వేదికగా హెచ్చరికలు చేసినట్టు సమాచారం. చూడాలి దీపావళి ముందు ఏం జరుగుతుందో..