Ind Vs Nz 2nd Test: మొదటి టెస్ట్ లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మొదటి టెస్టులో ఓడిపోయిన నేపథ్యంలో.. మిగతా రెండు టెస్టులు గెలిస్తేనే భారత్ సిరీస్ దక్కించుకుంటుంది. దీంతో రోహిత్ సేన పై తీవ్రమైన ఒత్తిడి ఉంది.. అయితే ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ 5 టెస్టులు ఆడింది. తొలి టెస్ట్ ఓడిపోయినప్పటికీ.. మిగతా మ్యాచ్ లలో విజయం సాధించి సిరీస్ దక్కించుకుంది.. అదే మ్యాజిక్ న్యూజిలాండ్ పై కూడా టీమిండియా రిపీట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
గెలుపు శాతాన్ని పెంచుకోవాలి
న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా లో పర్యటిస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే టీమిండియా.. న్యూజిలాండ్ తో జరిగే చివరి రెండు టెస్టులు, ఆస్ట్రేలియాలో తలపడే ఐదు టెస్టుల్లో మెరుగైన ప్రతిభ చూపించాలి. ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టుతో చివరి రెండు టెస్టులు గెలవాలి. తద్వారా గెలుపు శాతం పెంచుకొని.. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటాలి. అప్పుడే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోకి టీమిండియా ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. గెలుపు శాతం పెంచుకోవడం అత్యంత అవసరం కాబట్టి టీమిండియా పూణేలో స్పిన్ కు ఉపకరించే మందకొడి వికెట్ తో ప్రయోజనం దక్కించుకోవాలని భావిస్తోంది. గతంలో భారత జట్టును టర్నింగ్ వికెట్ వ్యూహం ఎదురుదెబ్బ తీసింది.. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం పూణేలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ అనుభవాల నేపథ్యంలో జట్టు కూర్పు విషయంలో మేనేజ్మెంట్ కఠినంగా ఉన్నది.
వారు ఇన్.. వీరు అవుట్
మెడనొప్పి వల్ల తొలి మ్యాచ్ కు గిల్ దూరమయ్యాడు. అయితే అతడు కోలుకోవడంతో రెండో టెస్టులోకి రావడం ఖాయం అయింది. తొలి టెస్ట్ లో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కోచ్ గంభీర్ మాత్రం రాహుల్ వైపు మొగ్గు చూపిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ దాటిగానే ఆడుతున్నప్పటికీ వాటిని భారీ స్కోరుగా మలచలేకపోతున్నాడు.. 2019 -20 కాలంలో దక్షిణాఫ్రికా జట్టుపై ఇదే మైదానంపై కోహ్లీ 254* రన్స్ చేసి సత్తా చాటాడు. కోహ్లీ మరోసారి అదే మ్యాజిక్ ప్రదర్శించాలని అభిమానులు ఆశిస్తున్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిట్ గా ఉండడంతో.. అతడు రెండో టెస్ట్ ఆడే అవకాశం కనిపిస్తోంది. అయితే సిరాజ్ ను పక్కనపెట్టి ఆకాష్ దీప్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అశ్విన్, జడేజా, కులదీప్ స్థానాలలో పెద్దగా మార్పు లేదని పిలుస్తోంది. ఒకవేళ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తే అశ్విన్ రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్య అవకాశాలున్నాయి. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది.. స్టార్ ఆటగాడు కేన్ విలియంసన్ దూరం కావడంతో ఆ జట్టు కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ… తడి స్థానాన్ని మిగతా ఆటగాళ్లు భర్తీ చేస్తారని చెబుతోంది.