HomeతెలంగాణPonguleti Vs CM KCR : బంగారు మయం చేసి.. ఎందుకు భయపడుతున్నారు? కెసిఆర్ కు...

Ponguleti Vs CM KCR : బంగారు మయం చేసి.. ఎందుకు భయపడుతున్నారు? కెసిఆర్ కు పొంగులేటి సూటి ప్రశ్న

Ponguleti Vs CM KCR : మొత్తానికి తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మరింత వేడిగా మారిపోతున్నాయి. నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే మొన్నటిదాకా ఈ మాటల యుద్ధం పెద్ద స్థాయి నేతలకే పరిమితం కాగా.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా బలమైన సవాళ్లు విసిరే స్థాయికి వచ్చారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. వాస్తవానికి మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితిలో ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధిష్టానంతో ఏర్పడిన విభేదాల కారణంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు వేచి చూసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏకంగా రాహుల్ గాంధీనే ఖమ్మం రప్పించుకున్నారు. అంతకుముందు జరిగిన పలు సమావేశాల్లోనూ ఆయన నేరుగా భారత రాష్ట్ర సమితి పెద్ద కేసీఆర్  ను చాలెంజ్ చేసి మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే ను కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపధం చేశారు. అదే మాటను తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కూడా స్పష్టంగా చెప్పారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ కో_ చైర్మన్ గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మొన్న గాంధీభవన్ వెళ్లారు. ఇక నిన్న అంటే గురువారం ఖమ్మంలోని డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ఆఫీసుకి వెళ్లారు.
నేరుగా కేసీఆర్ మీదనే
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ వాహన ర్యాలీతో ఆయనను ఆఫీసులోకి తోడ్కోని వెళ్లారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. “బంగారు తెలంగాణ చేశానని మీరు అంటున్నారు. గట్టిగా ఒక వర్షం కురిస్తే సెలవు ప్రకటించారు. ఎందుకంటే వర్షాలకు పాఠశాలలు కూలుతాయి కాబట్టి, అప్పుడు మీ ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుంది కాబట్టి ఆ విధంగా చేశారు.. మీరు చెప్తున్న బంగారు తెలంగాణ సాకారం అయి ఉంటే ఇవాళ ఎందుకు భయపడుతున్నారు” అని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యే లందరికీ టికెట్లు ఇవ్వాలని సవాల్ విసిరారు. ” మీరు చేసిన అభివృద్ధి మీద మీకు గనక నమ్మకం ఉండి ఉంటే కచ్చితంగా నేను విసురుతున్న సవాల్ ను స్వీకరిస్తారని అనుకుంటున్నా” అని పొంగులేటి వ్యాఖ్యానించారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు. జీతాలకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతినెల అప్పులు తీసుకొస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఇంకా 55 రోజులు మాత్రమే
కాంగ్రెస్ పార్టీ నాయకులను భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు ఇబ్బంది పెడుతున్నారని, అది కేవలం 55 రోజులు మాత్రమే ఉంటుందని పొంగులేటి జోస్యం చెప్పారు.. ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొక్కవోని దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ పార్టీ దేనని, ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక కేసీఆర్ రకరకాల కుయుక్తులకు తెరతీస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ వేసే పాచికలు తెలంగాణలో పారబోవని పొంగులేటి పేర్కొన్నారు. కాగా ప్రచార కమిటీ కో చైర్మన్ గా జిల్లాకు వచ్చిన అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేరుగా కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular