MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫిబ్రవరి 27న ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ అంతా ప్రశాతంగా జరిగింది. ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంనగర్–మెదక్ పట్టభద్రుల స్థానానికి 70 శాతం, ఉపాధ్యాయుల స్థానాలకు 91 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రుల స్థానానికి గతంలో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో పెరిగిన ఓటింగ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ స్థానానికి చతుర్ముఖ పోటీ నెలకొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టభద్రుల స్థానానికి ప్రాధాన్యత పెరిగింది. రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుండడంతో గెలుపు ఉత్కంఠ రేపుతోంది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు బీఎస్పీ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థి మధ్యనే ప్రధానపోటీ నెలకొంది. ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ మద్దతుతో పోటీలో ఉన్న మరో అభ్యర్థి కూడా గట్టిగానే పోటీ పడ్డారు.
Also Read: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో
అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా..
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదే సమయంలో బీజేపీ సైతం గెలుపే లక్ష్యంగా పనిచేసింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు అభ్యర్థి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. విద్యావంతులు ఓటు వేయనున్న నేపథ్యంలో గెలుపు ఎవరిది అనేది ఉత్కంఠ రేపుతోంది. రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ఓటర్లు తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటువేసుకునే అవకాశం ఉంటుంది. మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం గట్టిగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తిగా మారింది.
ఒకచోట కాంగ్రెస్, మూడు చోట్ల బీజేపీ
కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు రోట్ల బీజేపీ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ గ్రాడ్యుయుట్ స్థానానికి మాత్రమే పోటీ చేస్తోంది. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి పోటీలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టలేదు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ ప్రాధాన్యతకన్నా యూనియన్ల ప్రభావమే ఎక్కువగా ఉండడంతో రెండు చోట్ల ఎవరు ఎలుస్తారనే విషయానికి అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. ఉపాధ్యాయ సంఘాల్లో చీలికతో గెలుపు ఎవరిది అనేది స్పష్టత లేకుండా పోయింది. ఇక పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్‌రెడ్డి మూడో స్థానానికే పరిమితమని తెలుస్తోంది.
మొదటి ప్రాధాన్యంతో ఫలితం కష్టం..
కరీంనగర్–నిజాబాబాద్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశం లేదని స్పష్టమవుతోంది. నలుగురి మధ్య పోటీ ఉండడంతో మూడు లేదా నాలుగో ప్రాధాన్యత ఓటుతో మాత్రమే ఫలితం తేలే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డికి వేసినా… మూడు, నాలుగో ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణకు వేసినట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణకు వేసినవారు.. రెండో ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డికి వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూడు లేదా నాలుగో ప్రాధాన్యత ఓటుతో గెలుపు ఎవరిది అనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ మద్దతుతో పోటీ చేసిన శేఖర్‌రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసినవారు రెండో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేశారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుతో ప్రసన్న హరికృష్ణ బయటపడే అవకాశం కూడా ఉంది.
Also Read: పిఠాపురం ఇలాకాలో ఓటుకు రూ.3000.. పట్టభద్రులు పండుగ చేసుకున్నారు.. వైరల్ వీడియో