IND Vs PAK: క్రికెట్ లో భారత్ – పాక్ (IND vs PAK) మధ్య పోటీ అంటే చాలు అభిమానులు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. భారత్ పై గెలవాలని పాకిస్తాన్ అభిమానులు.. పాకిస్తాన్పై విజయం సాధించాలని భారత అభిమానులు కోరుకుంటారు. టీవీలకు అతుక్కుపోతారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లకు అంటుకుపోతారు. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో పాక్ పై భారత జట్టుకే మెరుగైన రికార్డు ఉంది.
Also Read: టీం ఇండియాను కలవరపాటుకు గురిచేస్తున్న న్యూజిలాండ్ రికార్డులు..
2017 నాటి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు పాకిస్తాన్ తొలిసారిగా షాక్ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. నాడు సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ జట్టు అన్ని విభాగాలలో భారత్ పై అప్పర్ హ్యాండ్ సాధించింది. ఏకంగా 180 పరుగుల తేడాతో విజయం సాధించి.. నాటి భారత జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ చేతిలో ఎదురైన వైఫల్యాన్ని మర్చిపోవడానికి భారత జట్టుకు చాలా కాలమే పట్టింది. ఇక 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లోనూ భారత్ పాకిస్తాన్ పై గెలుపును సొంతం చేసుకుంది. 2022లో జరిగిన టి20 వరల్డ్ కప్ లోనూ భారత జట్టే విజయాన్ని అందుకుంది. మొత్తంగా 2017 నాటికి ఓటమికి భారత్ పాకిస్తాన్ పై ఇంకా బదులు తీర్చుకుంటూనే ఉంది. పాకిస్తాన్ ఓడిపోతూనే ఉంది.
మూడుసార్లు తలపడతాయట
ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. భద్రత కారణాల వల్ల భారత్ దుబాయ్ లో మ్యాచులు ఆడుతోంది. ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై భారత్ ఆరు వికెట్ల తేడాతో విక్టరీని నమోదు చేసింది. అంతేకాదు ఈ విజయం ద్వారా ఏకంగా సెమీఫైనల్ వెళ్ళిపోయింది. మార్చి 2న న్యూజిలాండ్ జట్టుతో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఇందులో గనుక గెలిస్తే గ్రూప్ – ఏ లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. అయితే చాంపియన్ ట్రోఫీతోనే భారత్ – పాకిస్తాన్ సమరం ముగిసిపోలేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఏర్పడిన వైరుధ్యాల వల్ల.. పాక్ – భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఆడే అవకాశం లేదు. అయితే ఐసీసీ నిర్వహించే ఆసియా కప్ -2025 లో భారత్ – పాకిస్తాన్ (IND vs PAK)మూడుసార్లు తలపడతాయని తెలుస్తోంది. అన్ని కుదిరితే గ్రూప్ దశలో ఒకసారి, సూపర్ ఫోర్ దశలో ఒకసారి, ఫైనల్ (పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన చేస్తేనే) లో మరొకసారి తలపడే అవకాశం ఉంది. ఈ టోర్నీని శ్రీలంక లేదా దుబాయ్ లో నిర్వహించేందుకు ఐసీసీ కసరత్తు చేస్తోంది. టి20 విధానంలో ఈ టోర్నీని నిర్వహిస్తామని ఇప్పటికే ఐసీసీ ప్రకటించింది. అన్ని అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్లో ఈ టోర్నీ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read: పాకిస్తాన్ చెత్త రికార్డ్.. 23 సంవత్సరాలలో ఏ జట్టుకు సాధ్యం కాని అపఖ్యాతి..