Kavitha Bail: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు 50 మందికిపైగా అరెస్టు చేశాయి. వీరిలో చాలా మంది అప్రూవర్లుగా మారడంతో బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సుమారు ఏడాదికిపైగా జైల్లో ఉన్నారు. ఆయన అప్రూవర్‌గా మారకపోవడంతో బెయిల్ దొరకలేదు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అప్రూవర్‌గా మారలేదు. దీంతో విచారణ కోసం వారికి బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు కోర్టులను కోరుతున్నాయి. దీంతో వీరికి బెయిల్ రావడం లేదు. అయితే తాజాగా కవితకు దేశ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సుమారు ఐదున్నర నెలలు జైల్లో ఉన్న కవితకు బెయిల్ రావడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. అయితే కవిత బెయిల్‌పై తెలంగాణలో పొలిటికల్ వార్ మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఊహించిందే అన్న కాంగ్రెస్..
కవితకు బెయిల్ రావడంపై టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితకు బెయిల్ వస్తుందని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రహస్య ఒప్పందం ప్రకారం బెయిల్ వచ్చిందని పేర్కొన్నారు. కవిత బెయిల్ కోసమే కేటీఆర్, హరీశ్‌రావు నెల రోజులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేశారని ఆరోపించారు. ఎట్టకేలకు వారి ప్రదక్షిణ ఫలించి కేంద్రం కరుణించడంతోనే బెయిల్ మంజూరైందని పేర్కొన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకులు మండిపడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పును తప్పుపట్టడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కృషితోనే..
ఇక కవితకు బెయిల్‌పై బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కు కావడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. వితకు బెయిల్ రావడంపై అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్‌కు శుభాంకాంక్షలు చెప్పారు. అటు బీఆర్‌ఎస్ వ్యక్తికి బెయిల్, ఇటు కాంగ్రెస్ వ్యక్తికి రాజ్యసభ సీటు ఒకేసారి వచ్చాయని పేర్కొన్నారు. కవిత బెయిల్ కోసం వాదనలు వినిపించిన వ్యక్తిని రాజ్యసభకు ఏకగ్రీవంగా నామినేట్ చేయడంలో కేసీఆర్ రాజకీయ చతురత చూపించారని ఎద్దేవా చేశారు. వైన్ అండ్ డైన్ నేరగాళ్లకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్..
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. మంగళవారం సుప్రీం కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. తీర్చుపై కవిత సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘థాంక్యూ, సుప్రీంకోర్టు, ఊరట లభించింది.. న్యాయం గెలిచింది’ అని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ ట్వీట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి సుప్రీం కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల్ని కోర్టు ధిక్కరణగా భావించి చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై.చంద్రచూడ్‌ను ఎక్స్ ద్వారా కోరారు.
రాత్రికి ఢిల్లీలోనే..
ఇదిలా ఉంటే.. మరోవైపు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవిత విడుదలకు సంబంధించిన ప్రక్రియను ఆమె తరుఫు లాయర్లు ప్రారంభించారు. ట్రయల్ కోర్టుకు షూరిటీ పత్రాలు, ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జైలు సమయానికి ఈ ప్రక్రియ పూర్తయితే సాయంత్రమే కవిత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. జైలు నుంచి విడుదలైతే కవిత రాత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు ఢిల్లీ నుంచి కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి కవిత హైదరాబాద్‌కు రానున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More