TRS Tickets Tension: ‘పీకే’ వచ్చాడు మా ప్రాణాల మీదకు తెచ్చాడని ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మౌనంగా రోదిస్తున్నారట.. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడుదామనుకుంటున్న కేసీఆర్.. ఈ క్రమంలోనే తన వ్యూహాలను పక్కనపెట్టి దేశంలోని పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు.ఇప్పుడు ఆయన తెలంగాణలో స్టడీ చేసిన ఇచ్చిన నివేదిక మంటలు రాజేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ప్రశాంత్ కిశోర్ నివేదిక గుబులు రేపుతోంది. శని, ఆదివారాలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమైన పీకే.. గులాబీ ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే నివేదికను కేసీఆర్‌కు అందించారని సమాచారం. ఆ 40 మందిని మార్చాలని నివేదికలో సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరి టికెట్ ఊస్ట్ అవుతుందో అని ఇప్పుడు గులాబీ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

-ఆ నాలుగు జిల్లాల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత
రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పీకే నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నాలుగు జిల్లాలో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పీకే సర్వే నివేదికలో పేర్కొన్న టికెట్లు కోల్పోయే ఎమ్మెల్యేలు ఈ నాలుగు నియోజకవర్గాల్లోనే ఉండి ఉంటారని అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అలా అనుకోవడానికి అవకాశం లేదని, పీకే సర్వే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నిర్వహించారని, ఆ నాలుగు జిల్లాల్లో పార్టీపై వ్యతిరేకత ఉందని మాత్రమే నివేదిక ఇచ్చినట్లు తెలిసిందని, 40 మందికి టికెట్లు ఇవ్వొద్దని ఆ నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలనే సూచించి ఉంటారని భావించడం సరికాదని మరికొందరు పేర్కొంటున్నారు.
-సర్వే నిర్వహించిన అంశాలు తెలిస్తేనే..
పీకే ఆధ్వర్యంలోని ఐపాక్ నిర్వహించిన సర్వేలో ఏయే అంశాలపై సర్వే చేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల వ్యక్తిగత విషయాలు ఏమడిగారనే విషయాలు తెలిస్తే టికెట్లు కోల్పోయే ఎమ్మెల్యేలు ఎవరనేది కొంత వరకు ఊహించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పీకే సర్వే చేసిన అంశాలు ఆయనకు, కేసీఆర్‌కు మాత్రమే తెలిసి ఉంటాయని, ఇందులో ఎంత మంది ఎమ్మెల్యేలకు పాస్ మార్కులు వచ్చాయి.? ఎంతమంది ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారనే జాబితా గులాబీ బాస్ చేతిలో ఉన్నందున ఆయన ఈ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోకపోవచ్చని భావిస్తున్నారు. తన సొంత టీం ద్వారా కూడా మరోమారు కేసీఆర్… ‘పీకే నివేదిక’లో ఫెయిల్ మార్కులు వచ్చినవారిపై సర్వే చేయిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల వరకూ కేసీఆర్ సర్వేలు కొనసాగిస్తారని పేర్కొంటున్నారు.
-ఆర్థిక అంశాలు కీలకమే..
వచ్చే ఎన్నికల్లో ఆర్థిక అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న ఎన్నికలన్నీ ఖరీదయ్యాయి. సర్పంచ్ నుంచి లోక్‌సభ ఎన్నికల వరకూ అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లకే నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులు కూడా కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో పీకే రిపోర్డులో ఫెయిల్ అయిన వారు ఆర్థికంగా సంపన్నులు అయితే వారి టికెట్‌కు ఢోకా ఉండదని పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. అలాంటి ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించి అవసరమేతే మరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత, ఖర్చు భరించే భారం వారిపైనే వేస్తారని గులాబీ నేతలు గుసగులసాడుతున్నారు.
-పక్కచూపులు చూసేవారు ఎవరో..
ప్రశాంత్ కిశోర్ తన సర్వే నివేదికలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే పక్క పార్టీలవైపు చూస్తున్నారని సీఎం కేసీఆర్‌కు రిపోర్డు చేశారు. ఇందులో కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలతోపాటు మరికొన్ని కొత్త జిల్లాల ఎమ్మెల్యేల పేర్లు నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్నికల నాటికి పార్టీని వీడేందుకు ఇప్పటి నుంచే తనతో ఉండే క్యాడర్‌లో ముఖ్య నేతలను కాషాయ పార్టీలోకి పంపిస్తున్నట్లు తెలిపారు. దీంతో పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు భుజాలు తడుముకుంటున్నారు. పీకే నివేదికలో తమ పేరు ఉందో.. ఉంటే కేసీఆర్ ఇకపై తమతో ఎలా వ్యవహరిస్తారో అని టెన్షన్ పడుతున్నారని సమాచారం. ఈ విషయం ప్లీనరీ సందర్భగా బయట పడుతుందేమో అని ఆందోళన చెందుతున్నారట. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కేసీఆర్‌కు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసని, పీకే నివేదిక ఆధారంగా ఆయన ఇప్పటికిప్పుడు ఎవరినీ మందలించకపోవచ్చని అంటున్నారు.
ఏది ఏమైనా.. రెండు రోజులు పీకే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిపిన మంతనాల్లో ఎవరి జాతకం విప్పారో.. ఎవరి గురించి ఏం చెప్పారో.. ఎంతమందికి టికెట్ మార్చమన్నారో అనే ఆందోళన మాత్రం 90 శాతం మంది అధికార పార్టీనేతల్లో కనిపిస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న టెన్షన్ మాత్రం నెలకొంది.
Recommended Videos