Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారక్క జాతరకు పేరుంది.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తారు. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు కేటాయిస్తోంది. భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం మేడారం ప్రాంతంలో అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయి.
మేడారం అనగానే సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు గద్దెలు గుర్తుకొస్తుంటాయి. సమ్మక్క కాకతీయ రాజులతో వీర పోరాటం చేసి.. వీరమరణం చెందారు. అందువల్లే ఆమెను, ఆమె పిల్లలు సారక్క, భర్త పగిడిద్దరాజు, కుమారుడు జంపన్న ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తుంటాయి. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు గద్దెల రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంటారు. భక్తులు బంగారాన్ని (బెల్లం) సమ్మక్క సారలమ్మ కు సమర్పిస్తుంటారు.
సమ్మక్క, సారలమ్మ గద్దెల రూపంలో కొలువై ఉన్న విషయం తెలిసిందే. అయితే శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ఆలయ చరిత్రను, రూపురేఖలను మార్చేస్తోంది.. వందల ఏళ్ల మేడారం చరిత్రలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల కు చెందిన పాత గద్దెలు ఇకపై కనిపించవు. బుధవారం నూతన గద్దెలను ప్రతిష్టాపన చేస్తున్నారు. ప్రతిష్టాపన అనంతరం పాత గద్దెల చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్ తొలగించారు. గతంలో సమ్మక్క గద్దె పక్కన పగిడిద్దరాజు, సారలమ్మ గద్దె పక్కన గోవిందరాజు గద్దెలు ఉండేవి కావు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా, పూజారుల అభీష్టం మేరకు ఈ గద్దెలు మొత్తం ఒకే వరుస క్రమంలోకి వస్తాయి.
ఇప్పటికే ఈ గద్దెల ప్రతిష్టాపనకు సంబంధించి పూజారులు పూజలు మొదలుపెట్టారు. సంప్రదాయ ఆదివాసి డప్పు చప్పులతో పూజారులు నూతన గద్దెల వద్ద పూజలు మొదలుపెట్టారు. నూతన గద్దెలతో మేడారం శోభాయమానంగా దర్శనమిస్తోందని ఇక్కడి భక్తులు చెబుతున్నారు.