Ration Card Holders In AP: ఏపీ ( Andhra Pradesh) ప్రజలకు గుడ్ న్యూస్. రేషన్ లో భాగంగా ఇకనుంచి గోధుమపిండి కూడా అందనుంది. జనవరి నెల నుంచి ప్రతినెల గోధుమపిండి అందించేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రతి కార్డుదారునికి కిలో చొప్పున గోధుమపిండి అందించనుంది ప్రభుత్వం. కిలో 20 రూపాయలకే అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ముందుగా జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాల్లో అందిస్తుంది. డిమాండ్ బట్టి గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. నిరుపేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాల వారికి ఇది శుభవార్త.
* భగ్గుమంటున్న నిత్యవసరాలు
వాస్తవానికి నిత్యవసరాల ధరలు మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. అందుకే రేషన్ పంపిణీలో భాగంగా రాయితీ ధరపై వాటిని అందించాలన్న డిమాండ్ ఉంది. గతంలో టిడిపి( Telugu Desam Party) ప్రభుత్వ హయాంలో 12 రకాల వస్తువులు అందించేవారు. క్రమేపి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని తగ్గించాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం బియ్యం మాత్రమే అందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచదారతో పాటు కందిపప్పు అందిస్తున్నారు. ఇప్పుడు గోధుమ పిండి కూడా అందించాలని నిర్ణయించడం హర్షించదగ్గ పరిణామం.
* పండుగ కానుకలేవి?
2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన పండుగల సమయంలో కానుకలు అందించింది. హిందువులకు సంక్రాంతి కానుక( Sankranti kanuka ), ముస్లింలకు రంజాన్ తోఫా, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుక అందించేవారు. అన్ని రకాల నిత్యవసరాలు పండుగ పూట అందేలా ఒక బ్యాగ్ తో కూడిన కిట్ అందించేవారు. పండుగ సమయాల్లో ఇది ఎంతగానో దోహద పడింది. పేదలతో పాటు సామాన్యులకు కొండంత అండగా నిలిచేది. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కానుకలన్నీ రద్దు అయ్యాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు ఈ కానుకుల ఊసు లేదు. అయితే ఇప్పుడు గోధుమపిండి అందిస్తామని చెప్పడం మాత్రం సామాన్యులకు ఉపశమనం కలిగించే విషయం.