TS Salaries: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర ఉద్యోగులది. ఉద్యమానికి సారథ్యం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ విషయాన్ని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే.. అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తమది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ప్రకటించారు. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. ఉద్యోగులు 40 శాతం పీఆర్సీ అడిగితే మరో రెండు శాతం ఎక్కువగా ఇచ్చి ఆకట్టుకున్నారు. తొలి ఐదేళ్లలో ఉద్యోగులతో పాలాభిషేకాలు చేయించుకున్న కేసీఆర్.. రెండోసారి అధికారంలోకి వచ్చాక కనీసం వేతనాలు కూడా ఠంచన్‌గా ఇవ్వలేకపోయారు. ఈ విషయాన్ని ఉద్యోగులు ఎంత గగ్గోలు పెట్టినా.. కేసీఆర్ ఉద్యోగ సంఘాలను మేనేజ్ చేస్తూ.. మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయకుండా కవర్ చేస్తూ వచ్చారు. ఉద్యోగి వేతనం కోసం 20 తారీఖు వరకు కూడా వేచిచూసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక పెన్షనర్ల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఒకనెల పెన్షన్ మరో నెల చెల్లించారు. ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరగిందని గుర్తించినా.. వేతనాలు చెల్లించలేని స్థితి ఏర్పడింది.
ఏపీలోనూ ఇదే పరిస్థితి..
ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కానీ, ఇక్కడ మీడియాను జగన్ కవర్ చేయలేకపోయారు. ప్రభుత్వ అనుకూల మీడియా కంటే.. వ్యతిరేక మీడియానే ఎక్కువగా ఉండడంతో ఉద్యోగుల ఇబ్బందులు, వేతనాలు సంక్రమంగా రాకపోవడంపై పత్రికలు, టీవీ చానెళ్లలో కథనాలు వచ్చేవి. ఇప్పటికీ వస్తున్నాయి. ఇప్పటికీ ఏపీలో ఉద్యోగులకు తొలి వారంలో కూడా వేతనాలు అందడం లేదు.
జీతాలు పడ్డాయ్..
ఇక తెలంగాణలో ప్రభుత్వం మారింది. ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు చెల్లించలేని ప్రభుత్వాన్ని ఉద్యోగులు, ప్రజలు పడగొట్టారు. కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా ఉద్యోగుల జీతాల విషయంలో గతంలో కాకుండా 4వ తేదీలోపే 30 శాతం ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేశారు. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లకు మళ్లీ 5వ తేదీలోపే ఖాతాల్లో జీతాలు పడ్డాయని చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ మీడియా కూడా కవర్ చేసింది. ప్రస్తుతానికి అయితే రేవంత్ సర్కార్‌కు అనుకూలంగానే కథనాలు రాస్తున్నాయి. అయితే ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.