Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో పంచాయతీలు పాలకవర్గాలు లేక ఏడాదికాలంగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. అభివృద్ధి నిధులు ఆగిపోయాయి. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు. మౌలిక సదుపాయాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బీసీ కుల గణన నివేదికను కమిటీ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్రంలో 42 శాతం మంది బీసీలు ఉన్నట్లు తెలిపింది. దీంతో కొత్త రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్ ఇచ్చారు.
ఫిబ్రవరి 15కు ముందే..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 15లోపే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. దీంతో పంచాయతీ ఎన్నికలపై ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కుల గణనపై ప్రభుత్వం తీసుకున్న చర్చల గురించి కూడా మంత్రి వెల్లడించారు. కుల గణన నివేదిక ఆధారంగా పంచాయతీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈనెల 4న ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించనున్నట్లు తెలిపారు. మరోవైపు రిజర్వేషన్ల ప్రకటనపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. మార్చి తొలివారంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.
ఆశావహుల అలర్ట్..
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మరో పక్షం రోజుల్లో వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ప్రజల్లో ఉంటున్న నేతలు వారిని మచ్చిక చేసుకునే పనుల్లో ఉన్నారు. ఇక రేపటి నుంచి మరింత కలిసిపోయే అవకాశం ఉంది. సమస్యలు కూడా పరిష్కరిస్తారని తెలుస్తోంది. మరోవైపు మెజారిటీ పంచాయతీ స్థానాలను తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ పావులు కదుపుతోంది. సంక్షేమ పథకాల ఎంపిక ప్రకియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.