Operation Kagar : 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం అనేది లేకుండా చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల వేట కొనసాగిస్తోంది. గడిచిన నాలుగు నెలలల్లో వందల మందిని ఎన్కౌంటర్ చేయించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండపై వ్యతిరేకత పెరుగుతోంది. మావోయిస్టులు చర్చలకు వస్తామని ప్రకటించినా.. కేంద్రం ఆపరేషన్ కొనసాగించడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
Also Read : కెసిఆర్ ప్రసంగంలో రేవంత్ పేరు గాయబ్.. వ్యూహాత్మకమా? నిర్లక్ష్యమా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎల్కతుర్తి సభ వేదికగా పిలుపునిచ్చారు. మరుసటి రోజే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆపరేషన్ కగార్‌పై కీలక సమావేశం నిర్వహించారు. మాజీ హోం మంత్రి జానారెడ్డితో సమావేశమై ఆపరేషన్ కగార్ అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టుల టార్గెట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
వివాదాస్పదమవుతున్న కేంద్రం చర్యలు
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై దాడులు చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో బాంబు దాడుల ద్వారా వందలాది మంది మావోయిస్టులు మరణిస్తున్నట్లు సమాచారం. ఈ చర్యలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు పలు పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఆపరేషన్ మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోందని, సామాజిక సమస్యలను సైనిక చర్యలతో పరిష్కరించలేమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సామాజిక కోణంలో నక్సలిజం చర్చ..
ఈ క్రమంలో తెలంగాణ సీఎం మీడియాతో మాట్లాడుతూ నక్సలిజం సమస్యను సామాజిక కోణంలో పరిశీలించాలని, కేవలం శాంతి భద్రతల సమస్యగా చూడకూడదని స్పష్టం చేశారు. ‘‘మావోయిస్టుల భావజాలాన్ని చంపడం సరైన పరిష్కారం కాదు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలి,’’ అని ఆయన అన్నారు. శాంతి చర్చల కమిటీ సమావేశంలో కూడా ఈ విషయాన్ని ఆయన ఉద్ఘాటించారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, ఈ విషయంపై మంత్రులతో చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని రేవంత్ తెలిపారు.
పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం
కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం తమ అధికారిక విధానాన్ని ప్రకటిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని సీనియర్ నాయకులు, సలహాదారులతో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు రాష్ట్రంలో నక్సలిజం సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు.
పౌర హక్కుల సంఘాల ఆందోళన
ఆపరేషన్ కగార్‌లో అమాయక పౌరులు, గిరిజనులు కూడా బలవుతున్నారని పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని, సామాజిక–ఆర్థిక సమస్యలను పరిష్కరించడం ద్వారా మావోయిస్టు ఉద్యమాన్ని నియంత్రించాలని వారు కోరుతున్నారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా రాష్ట్రంలోని పలు సామాజిక సంస్థలు, రాజకీయ నాయకులు కూడా గళం విప్పుతున్నారు.
భవిష్యత్తు దిశగా అడుగులు
శాంతి చర్చలు: నక్సలిజం సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు శాంతి చర్చల కమిటీ ద్వారా చర్చలు కొనసాగించాలని సీఎం సూచించారు.
సామాజిక సంస్కరణలు: గిరిజన, బడుగు వర్గాల ఆర్థిక–సామాజిక సమస్యలను పరిష్కరించడం ద్వారా మావోయిస్టు ఉద్యమానికి మూల కారణాలను తొలగించాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కేంద్రంతో సంప్రదింపులు: ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఆపరేషన్ కగార్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న వైఖరి, నక్సలిజం సమస్యను సామాజిక కోణంలో పరిష్కరించాలనే ఆలోచన రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీసింది. జాతీయ స్థాయిలో ఈ అంశంపై చర్చ జరిగితే, శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా ఉండనున్నాయి.
Also Read: ఆపరేషన్ కగార్ ఆపండి.. ఎల్కతుర్తి నుంచి కేసీఆర్ పిలుపు!