HomeతెలంగాణOperation Durgam Cheruvu: ఆపరేషన్ దుర్గం చెరువు.. హైడ్రా బాస్ మదిలో ఏముంది? తర్వాత ఏం...

Operation Durgam Cheruvu: ఆపరేషన్ దుర్గం చెరువు.. హైడ్రా బాస్ మదిలో ఏముంది? తర్వాత ఏం జరగబోతోంది? సర్వత్రా ఉత్కంఠ

Operation Durgam Cheruvu: ఇటీవల హైదరాబాదులో హైడ్రా కు ఏకంగా పోలీస్ స్టేషన్ కూడా నిర్మించారు. దానిని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రారంభించారు. హైడ్రాకు వాహనాలు కూడా సమకూర్చారు. అధికారులను కూడా నియమించారు. బడ్జెట్ కూడా కేటాయించారు. దీంతో హైడ్రా మరింత వేగంగా అడుగులు వేస్తోంది. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతోంది. ఆక్రమణలను ఎక్కడికక్కడ తొలగిస్తోంది. కోర్టు కేసులు ఎదురు కాకుండా.. న్యాయమూర్తులు ఎదుట తలవంచుకోకుండా.. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి.. అని ఆధారాలను చూసుకొని ధైర్యంగా అడుగులు వేస్తోంది.. ఆక్రమణలను మొహమాటం లేకుండా తొలగిస్తోంది. ఇక ఇటీవలి కాలంలో హైడ్రా చేపట్టిన పనులు హైదరాబాద్ నగరవాసుల్లో హర్షాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బడా బాబుల ఆక్రమాలను హైడ్రా బయటపెట్టింది. ఆక్రమణలను తొలగించింది. జూబ్లీహిల్స్ నుంచి మొదలు పెడితే అమీన్పూర్ చెరువు వరకు హైడ్రా చేపట్టిన ప్రతి ఆపరేషన్ ప్రజల మనసులను చూరగొంటున్నది. ఏకంగా హైడ్రా బాస్ రంగనాథ్ సింగం అయిపోయారు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో సూపర్ కాప్ గా వెలుగొందుతున్నారు.

ఇక తాజాగా హైడ్రా అధిపతి రంగనాథ్ పర్యటించారు. ముఖ్యంగా హైదరాబాదులోని నాలాలలో వరద నీరు ప్రవహించే తీరును పరిశీలించారు.. ప్రధానంగా ఐటీ పరిశ్రమ నెలకొన్న మాదాపూర్ ప్రాంతంలో రంగనాథ్ పర్యటించడం సంచలనగా మారింది.. మాదాపూర్ లోని నెక్టార్ గార్డెన్స్ లో ఆన నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రంగనాధ్ అధికారులకు సూచించారు. ఇటీవల ఈ ప్రాంత ప్రజలు రంగనాథ్ ని కలిసి వర్షాకాలంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు..” వర్షం కురిస్తే చాలు నడుములోతు నీళ్లు మా కాలనీలలో నిల్వ ఉంటున్నాయి. చాలా రోజులపాటు ఆ నీరు కిందికి వెళ్లడం లేదు. ఆ సమయంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాం. ఆ సమస్యకు మీరే పరిష్కార మార్గం చూపించాలని” ఆయా కాలనీలవాసులు రంగనాథ్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు.. దీంతో రంగనాథ్ మాదాపూర్ ప్రాంతానికి వెళ్లారు. ముఖ్యంగా దుర్గం చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చేనీరు, వెళ్లే నీరు మొత్తాన్ని అధ్యయనం చేశారు.. వరద కాలువలను విస్తరించాలని.. వర్షాకాలంలో వరదను కొంచెం తగ్గిస్తే ముప్పు తగ్గించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని అధికారులతో చర్చించారు. ఇక దుర్గం చెరువు కింది భాగంలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా వరద కాలువకు ఏర్పడుతున్న ఆటంకాలను ఆయన దగ్గరుండి పరిశీలించారు.. దుర్గం చెరువులో ఇన్ ఆర్బిట్ మాల్ వైపు మట్టి పోయడంపై ఆయన అధికారులతో చర్చించారు. మట్టి అలా ఎలా పోస్తారు అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. ఈ మట్టి పోసిన వ్యక్తులు ఎవరు? అలా ఎందుకు చేశారు? దానివల్ల ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? అనే ప్రశ్నలను సంబంధిత అధికారులకు రంగనాథ్ సంధించినట్టు తెలుస్తోంది.

గతంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు దుర్గం చెరువు ప్రాంతంలో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను ఫ్లాట్లుగా చేసి విక్రయించారని విమర్శిస్తున్నారు. ఇవే విషయాలను ఇటీవల కాలంలో రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అందువల్లే ఆయన దుర్గం చెరువు ప్రాంతాన్ని సందర్శించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకులకు దగ్గరగా ఉన్న వ్యక్తులు దుర్గం చెరువును ఆక్రమించారని.. ప్లాట్లు చేసి విక్రయించారని ఆ పరిసర ప్రాంతాల ప్రజలు పకడ్బందీ ఆధారాలతో రంగనాథ్ ను కలిశారని తెలుస్తోంది. అయితే ఆ వివరాలను సరిపోల్చుకోవడానికే రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించారని.. త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే దుర్గం చెరువు ఆక్రమణలు దాదాపుగా తొలిగిపోతాయని స్థానికులు అంటున్నారు. అంతేకాదు వర్షాకాలంలో తమకు వరద సమస్య కూడా తగ్గిపోతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రంగనాథ్ దుర్గం చెరువు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular