https://oktelugu.com/

CM Revanth Reddy: రేవంత్ పాలనకు ఏడాది.. ఏం సాధించారు? ఎందులో విఫలమయ్యారు?

తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. సరిగ్గా గత ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు విజయవంతంగా ఏడాది పరిపాలన పూర్తిచేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 3, 2024 / 03:38 PM IST

    CM Revanth Reddy(14)

    Follow us on

    CM Revanth Reddy: ఏడాది పరిపాలన పూర్తయిన తర్వాత ఎవరికైనా కూడా ఆత్మ పరిశీలన ఉంటుంది. సింహవలోకనం కూడా ఉంటుంది. మరి రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతోంది? ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? హైకమాండ్ లక్ష్యాలను సాధించారా? ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? ఎటువంటి సమస్యలను కొని తెచ్చుకున్నారు? వాటన్నింటిపై పరిశోధనాత్మక కథనం ఇది. ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పూర్తిచేసుకుని రెండవ ఏడాదిలోకి రేవంత్ ప్రవేశించారు. ప్రభుత్వ అధినేతగా తన మార్క్ చూపించడంతోపాటు.. మార్పును కూడా ప్రజలకు అనుభవంలోకి తెచ్చారు. తన బృందంతో కలిసి పనిచేస్తూ కొత్త కొత్త విజయాలను నమోదు చేశారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా.. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ.. రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీ చేసి సరికొత్త ఘనత సృష్టించారు. అంతేకాదు తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించారు. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటా కు 500 చొప్పున బోనస్ ఇస్తున్నారు. ఇక మూసి నదిని సుందరీకరించేందుకు అడుగులు పడుతున్నాయి. వచ్చే 50 సంవత్సరాల అవసరాలు తీర్చే విధంగా హైదరాబాదు నగరం అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణానికి రేవంత్ ముందడుగు వేస్తున్నారు.

    హామీల అమలు

    ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నట్టు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది.. 500 కు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే గృహాలకు ఉచితంగా కరెంట్ సప్లై చేస్తోంది. పంట పొలాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా అవుతుంది.. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించడానికి 3000 వరకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. బాపూ ఘాట్ ప్రాంతంలో అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నగర వాసులకు గోదావరి నుంచి తాగునీరు అందిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు కంటే మెరుగ్గా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనున్నారు.

    బడ్జెట్ పెంపు

    కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైన రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల కాస్మెటిక్ చార్జీలను పెంచింది రేవంత్ ప్రభుత్వం.. మహిళల ఆర్థిక స్వావలంబనకు అడుగులు వేస్తున్నది. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ప్రపంచ స్థాయిలోనే విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ధరణి పోర్టల్. ఎన్ఐసీ కి అప్పగించారు. మీడియాకు స్వేచ్ఛ కల్పించారు. మాదకద్రవ్యాలపై ఉక్కు పాదం మోపారు. పెట్టుబడులను కూడా భారీగా ఆకర్షిస్తున్నారు. ప్రాంతీయ బాహ్య వలయ రహదారి, రైలు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయడంతో తెలంగాణ దిశ మరింతగా మారనుంది. టైర్ -2 పట్టణాలలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి. వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా తీర్చిదిద్దే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి వ్యక్తి పది లక్షల రూపాయల విలువైన ఉచిత వైద్యం అందించేందుకు ప్రణాళికలు పొందుతున్నాయి. ప్రతినెల ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు లభిస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం ఎదురుగా ఏర్పాటు కానుంది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సానుకూల అంశాలు.

    ప్రతికూల అంశాలు ఇవే

    లగచర్ల, హైడ్రా, మూసీ నది వెంబటి నిర్మాణాలను పడగొట్టడం, ప్రభుత్వ వసతి గృహాల్లో నాసిరకమైన ఆహారం విద్యార్థులకు పెట్టడం, రుణమాఫీ కొంతమందికి కాకపోవడం వంటివి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి. రైతు భరోసా కూడా ప్రభుత్వం ఖాతాలలో జమ చేయకపోవడం ఒకింత ఇబ్బందిగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడం లబ్ధిదారుల్లో అసహనాన్ని కలిగిస్తోంది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిబంధకాలుగా నిలిచాయి. మరోవైపు భారత రాష్ట్ర సమితి కూడా వరుసగా విమర్శలు చేస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వాన్ని ఎండగడుతోంది. మొత్తంగా చూస్తే తొలి ఏడాది రేవంత్ రెడ్డికి కేక్ వాక్ కాకపోయినప్పటికీ.. మరి తీసిపారేదగ్గ పరిపాలన మాత్రం కాదని విశ్లేషకులు అంటున్నారు. తొలి ఏడాది రేవంత్ రెడ్డి 100కు 75 మార్కులు తెచ్చుకున్నారని చెబుతున్నారు.. పరిపాలనలో మరింత నూతన ఒరవడి కొనసాగిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.