Homeజాతీయ వార్తలుCM Cup Tournament: సీఎం కప్ తోనే జేబుకు చిల్లులు.. మళ్ళీ అధికారుల తలల పై...

CM Cup Tournament: సీఎం కప్ తోనే జేబుకు చిల్లులు.. మళ్ళీ అధికారుల తలల పై దశాబ్ది ఉత్సవాల భారం

CM Cup Tournament: తెలంగాణ దశాబ్ది వేడుకలు అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఉత్సవాల నిర్వహణకు డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో వారిలో ఆందోళనలు నెలకొన్నాయి. ఖర్చు బారెడైతే.. సర్కారు ఇస్తున్నది బెత్తెడు మాత్రమే అని అధికారులు వాపోతున్నారు.. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ గతంలో ఎన్నడు లేనివిధంగా సీఎం కప్ అంటూ క్రీడా పోటీలకు తెర లేపారు. మండలానికి 15,000 చొప్పున ఇచ్చారు. నిర్వహణ ఖర్చు తడిసి మోపెడు కావడంతో తమ జేబులోనుంచి ఖర్చు చేసామని అధికారులు అంటున్నారు. ” దశాబ్ది ఉత్సవాల పేరిట మండలానికి కేవలం 30 వేలు మాత్రమే ఇస్తే ఏం చేయాలి” అంటూ అధికారులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. 21 రోజులపాటు చేపట్టవలసిన కార్యక్రమాలకు, ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏ మూలకు సరిపోతాయని వారు అంటున్నారు. ఒక్కొక్క మండలానికి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చేయాలంటే తక్కువలో తక్కువ పది లక్షల దాకా ఖర్చవుతాయని అధికారులు అంటున్నారు. 30 వేలల్లో ఈ కార్యక్రమాలు ఎలా పూర్తి చేస్తామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కప్ తో

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం పోటీలకు ఆయా మండలాల్లో ఏర్పాట్లు చేసేందుకే జేబులకు చిల్లులు పడ్డాయని మండల అధికారులు అంటున్నారు. మూడు రోజులపాటు క్రీడా పోటీల నిర్వహణ, ఇతర ఖర్చులు మొత్తం కలిపి ఐదు లక్షల దాకా అయ్యిందని, ప్రభుత్వం మంజూరు చేసిన 15000 ఏ మూలకూ సరిపోలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. క్రీడాకారులను తరలించేందుకు జేబులో నుంచి ఖర్చు చేసామని, ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

10 లక్షల దాకా..

దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రైతు వేదికల వద్ద సమావేశాల నిర్వహణకు.. ఒక్కొక్క వేదిక వద్ద సౌండ్ సిస్టం, టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం ఇతర ఏర్పాట్లు, వెయ్యి మందికి మాంసాహారం తో కూడిన భోజనాలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రకారం ప్రతి మండలంలో నాలుగైదు రైతు వేదికలు ఉంటే.. దీనికోసం తక్కువలో తక్కువ ఆరు లక్షల దాకా ఖర్చు అవుతుందని అధికారులు అంటున్నారు. అదేవిధంగా గ్రామాల్లో చెరువు కట్టల వద్ద కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇలా కార్యక్రమాలు చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని అధికారులు అంటున్నారు. ఇంతటి ఖర్చులకు, ప్రభుత్వం కేవలం 30000 మాత్రమే ఇస్తే ఎలా సర్దుబాటు చేయాలని అధికారులు అంటున్నారు.

సెలవులు రద్దు

మే నెలలో జేపిఎస్, ఓపీ ఎస్ లను రప్పించడంలో భాగంగా రెండవ శనివారం, ఆదివారం కూడా ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఇప్పుడు గురువారం నుంచి 22వ తేదీ దాకా సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇతర శాఖలకు చెందిన కార్యక్రమాల భారం తమపై మోపడం సరికాదని ఎంపీడీవోలు అంటున్నారు.. సెలవుల నేపథ్యంలో కనీసం కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇక గతంలో కేంద్రానికి సంబంధించిన కార్యక్రమం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి 30 లక్షల దాకా ఖర్చయింది. అప్పుడు ఆ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించింది. వాటి నిర్వహణకు డబ్బులు సర్దుబాటు చేయగా.. ప్రభుత్వం వారికి పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపలేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఇస్తుందో ఇవ్వదో అని తెలియక చాలామంది అధికారులు ఆ భారాన్ని ఆర్థికంగా స్థితిమంతమైన సర్పంచ్ల మీద మోపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సర్పంచ్లను ఆదేశిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే తమకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందని, అప్పులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. ఇలాంటి అప్పుడు ఈ భారాన్ని తమపై మోపితే ఎలా అని వారు కూడా ఎదురు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version