New trend in Hyderabad: తెలంగాణలో మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్ధత నెలకొంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. హైడ్రా కారణంగా చాలా మంది ఇళ్ల కొనుగోలుకు వెనుకాడారు. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అపార్టుమెంట్లు కొనేవారు తగ్గిపోతున్నారు. చిన్నదైనా సొంత ఇల్లు ఉండాలని చాలా మధ్య తరగతి ప్రజలు భావిస్తున్నారు. కాస్త సంపన్నులు, ధనవంతులు అయితే.. విల్లాలవైపు చూస్తున్నారు. దీంతో హైరైజ్ టవర్స్ చుట్టూ తిరిగిన పెట్టుబడులు, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలవైపు మళ్లాయి. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని బాచుపల్లి, పటాన్‌చెరు, గోపన్‌పల్లి, కొల్లూరు, మంచిరేవుల ప్రాంతాల్లో నెలకో కొత్త విల్లా ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. ‘‘ఐటీ కారిడార్‌కు దగ్గరగా ఉండే నివాస ప్రాంతాలే ఇప్పుడు రియల్ ఎస్టేట్ హాట్‌జోన్’’ అని బిల్డర్లు చెబుతున్నారు.
రణగొణ ధ్వనులకు దూరంగా.. ప్రకృతికి దగ్గరగా..
చాలా మంది నగరవాసులు ఇప్పుడు అపార్ట్‌మెంట్ జీవితం నుంచి బయటకు వచ్చి వ్యక్తిగత స్థలాన్ని కోరుకుంటున్నారు. పిల్లల విద్య, ఉద్యోగం, శివార్లలో సులభ రవాణా సదుపాయాలు కలవడంతో సిటీ వద్ద శాంతమైన వాతావరణం కోరే వర్గం పెరుగుతోంది. సొంత ఇంట్లో తోటలు, వ్యక్తిగత ఆవరణ, తగినంత స్పేస్ ఇవన్నీ ప్రస్తుతం నగర మధ్యలో లభించని విలువైన ‘‘లగ్జరీలు’’. అందుకే నగరానికి దూరంగా ఔట్‌కట్స్‌లో ప్రకృతికి దగ్గరా జీవించాలని కోరుకుంటున్నారు.
ట్రిప్లెక్స్ విల్లాలు…
ఇటీవలి విల్లా ప్రాజెక్టులు ఎక్కువగా ట్రిప్లెక్స్ నమూనాలో కడుతున్నారు. భూగర్భ ఫ్లోర్లో వంటగది, పెద్దల గది, మొదటి అంతస్తులో పిల్లల మంచిగదులు, ప్రైవేట్ బాత్‌రూమ్స్, పై అంతస్తులో హోంథియేటర్, అతిథుల గదులు లేదా రూఫ్ గార్డెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఒక్కో విల్లాకు స్థలం విస్తీర్ణం 150 నుంచి 1000 గజాల వరకు ఉండేలా చూసుకుంటున్నారు. పెద్ద స్థలాల్లో ముందుభాగంలో గార్డెన్, వెనక బ్యాక్యార్డ్ ఏర్పాటు సంప్రదాయ పట్టణ విలాసాన్ని తిరిగి తెస్తోంది.
పాశ్చాత్య శైలిలో ప్రాజెక్టులు..
కొత్త తరం బిల్డర్లు కేవలం ఇటుకల ప్రాజెక్టులకే పరిమితం కావడం లేదు. ఫారెస్ట్ టౌన్, ఎకో విల్లా, వివర్ వ్యూ రిజిడెన్స్ వంటి థీమ్ ప్రాజెక్టులు పెద్దగా ఆకర్షణ పొందుతున్నాయి. పచ్చదనం, శిల్పకళ, సుస్థిరత కలగలిపిన ఈ విల్లాలు మధ్యతరగతి నుండి ప్రీమియం వర్గం వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
నలువైపులా విస్తరిస్తున్న విల్లా ప్రాజెక్టులు..
విల్లా కల్చర్ నగరం నలువైపులా విస్తరిస్తోంది. పశ్చిమ హైదరాబాద్‌లోని బాచుపల్లి, బీరంగూడ, బౌరంపేట, వెలిమల, నల్లగండ్ల ప్రాంతాలు ఐటీ ఉద్యోగుల ఫేవరెట్లలో ముందున్నాయి. తూర్పు ప్రాంతంలోని ఘట్కేసర్, రాంపల్లి, హయత్‌నగర్, బండ్లగూడలో అందుబాటు ధరల విల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. దక్షిణ హైదరాబాద్‌వైపు విమానాశ్రయం పరిసర ప్రాంతాలు – అత్తాపూర్ నుంచి మహేశ్వరం దాకా – కొత్త ప్రాజెక్టులు వేగంగా వస్తున్నాయి. ఇక ఉత్తర హైదరాబాద్ వైపు కొంపల్లి, మేడ్చల్, దుండిగల్ చుట్టూ డూప్లెక్స్ హౌసింగ్ ప్రాజెక్టులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
పదేళ్ల క్రితం విల్లా అనేది ధనికులకు మాత్రమే చేరువగా ఉన్న భావన. కానీ ఇప్పటి ఆర్థిక స్థితులు, వృ ద్ధిరేట్లు, ఐటీ వేతనాలు, హోం లోన్ సౌకర్యాలు, ఆ భావనను మార్చేశాయి. సౌకర్యాలను ప్రాధాన్యతగా చూసే మధ్యతరగతి వర్గం కూడా ఇప్పుడు విల్లాలపై దృష్టి పెడుతోంది. పచ్చదనంతో మిళితమయ్యే ఈ కొత్త నివాస ధోరణి కొత్తదనాన్ని తెస్తోంది.