RoKo is back: 2 వన్డేలు గెలిచింది. సిరీస్ సొంతం చేసుకుంది. మూడో వన్డే కూడా గెలిచి వైట్ వాష్ చేయాలని అనుకుంది. కానీ టీమిండియా అంత ఈజీగా ఆస్ట్రేలియా ముందు తలవంచలేదు. పైగా ఈసారి ఆస్ట్రేలియా సిడ్నీ వేదికగా టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టుకు మరొక ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఆస్ట్రేలియా మూడుసార్లు టాస్ గెలిచింది. తొలి రెండుసార్లు బౌలింగ్ ఎంచుకొని.. టీమిండియాను ఇబ్బంది పెట్టింది. అయితే మూడోసారి బ్యాటింగ్ ఎంచుకోవడంతో సిడ్నీ మైదానంలో పరుగుల వరద పారుతుందని అందరూ అనుకున్నారు.
వాస్తవానికి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 36.2 ఓవర్ల వరకు 196/5 తో పటిష్టమైన స్థితిలోనే ఉంది. కానీ ఆ తర్వాతే టీమిండియా బౌలింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఆస్ట్రేలియా చూస్తుండగానే తదుపరి ఐదు వికెట్లను జస్ట్ 40 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. గంభీర్ శిష్యుడు ఏకంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తన కెరియర్ లోనే అద్భుతమైన బౌలింగ్ వేసి ఆకట్టుకున్నాడు. దాదాపు 300 పరుగులు చేస్తుందనుకున్న దశ నుంచి ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు కుప్పకూలింది.
237 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా ఏ దశలో కూడా వెనుకడుగు వేయలేదు. దూకుడుగా బ్యాటింగ్ చేసింది. రోహిత్ శర్మ (121*), విరాట్ కోహ్లీ (74*) రెండో వికెట్ కు ఏకంగా సెంచరీకి మించిన భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో టీమిండియాకు తిరుగులేకుండా పోయింది. కెప్టెన్ గిల్ (24) 24 పరుగులు చేసి సౌకర్యవంతంగానే కల్పించినప్పటికీ.. హేజిల్ వుడ్ బౌలింగ్లో క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. గత రెండు వన్డేలతాలుకు చేదు జ్ఞాపకాలను వదిలిపెట్టాడు.
విరాట్ కోహ్లీ ప్రారంభం నుంచి చివరి దాకా సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అదగోట్టాడు. 81 బంతుల్లో ఏడు బౌండరీల సహాయంతో 74 పరుగులు చేసిన విరాట్.. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. రోహిత్, విరాట్ దూకుడు ద్వారా టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టు పై 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఇప్పటికే టీం ఇండియా వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ.. మూడో వన్డే జరుగుతున్న సిడ్ని మైదానానికి ప్రేక్షకులు భారీగా వచ్చారు. వారంతా కూడా రోహిత్, విరాట్ నామస్మరణతో ఊగిపోయారు. ఆ స్థాయిలో వచ్చిన ఆశేషమైన ప్రేక్షకులకు అద్భుతమైన క్రికెట్ మజాను విరాట్, రోహిత్ అందించారు.
విరాట్, రోహిత్ అద్భుతమైన జోడి. వీరిద్దరూ ఫామ్ లోకి వస్తే ఎంతటి గొప్ప జట్టు అయినా సరే తలవంచాల్సిందే. ఆస్ట్రేలియా కూడా అలాంటి అనుభవమే శనివారం ఎదురైంది. సొంత మైదానంలో ఆస్ట్రేలియా ప్లేయర్లపై రోహిత్, విరాట్ పై చేయి సాధించారు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశారు. తద్వారా ఆస్ట్రేలియా జట్టుకు 9 వికెట్ల తేడాతో ఓటమిని బహుమతిగా అందించారు. రోహిత్, విరాట్ బ్రిలియంట్ ఫామ్ లోకి రావడంతో ఆస్ట్రేలియా జట్టుకు ఘోరమైన పరాభవం మిగిలింది.