Nizamabad Soumya Case: భర్తను కొంతమంది వ్యక్తులు, ప్రియుడితో కలిసి చంపించింది. ఆ తర్వాత అతడికి గుండెపోటు అని ప్రచారం చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం తెలియడంతో.. ఆమెను, ఆమె ప్రియుడిని, ఈ హత్య కేసులో పాలుపంచుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని నిజాలు రాబట్టడానికి పోలీసులు విచారణ చేస్తుంటే.. షాకింగ్ పరిణామాలు ఎదురవుతున్నాయి.
నిజామాబాదులో భర్తను భార్య హత్య చేసిన ఘటనలో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య సౌమ్య.. భర్త రమేష్ పై రెండు కోట్లకు పైగా జీవిత బీమా చేయించింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే సౌమ్య తన భర్త రమేష్ హత్యకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ప్రియుడు దిలీప్ సహకారం తీసుకుంది. పైగా తమ వివాహేతర సంబంధానికి భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని.. అతడిని అంతం చేయాలని సౌమ్య గట్టిగా నిర్ణయించుకుంది. ప్రియుడు దిలీప్, కిరాయి హంతకులతో భర్తను చంపేసిన తర్వాత.. బీమా డబ్బుల కోసం సాధారణ గుండెపోటు అని చిత్రీకరించింది. నిద్ర మాత్రలు ఇచ్చి భర్త గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత అతడికి గుండెపోటు వచ్చిందని నమ్మించింది. రమేష్ తమ్ముడు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు అతడి మృతదేహానికి రి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పోలీసుల విచారణలో సౌమ్య అసలు నిజం చెప్పడంతో.. దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని కూడా విచారించగా.. అసలు నిజాలు బయటపెట్టాడు.
నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బోర్గాం గ్రామానికి చెందిన రమేష్ తన భార్య సౌమ్య, పిల్లలతో కలిసి నివాసం ఉండేవాడు. సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ గా పని చేసేది. ఇదే పాఠశాలలో పి ఈ టిగా పని చేస్తున్న దిలీప్ తో ఆమెకు సంబంధం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. ఈ విషయం రమేష్ కు తెలిసింది. దీంతో అతడు ఆమెను నిలదీశాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని సౌమ్య ప్రియుడు దిలీప్ తో ప్రణాళిక రూపొందించింది. గత నెల సౌమ్య తన ప్రియుడు దిలీప్ తో కలిసి రమేష్ ను ఇంట్లోనే హత్య చేసింది. తన భర్తకు గుండెపోటు అని నమ్మించింది. ఎవరికి ఎటువంటి అనుమాన రాకుండా అంత్యక్రియలు జరిపింది. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో రమేష్ మెడ మీద గాట్లు కనిపించాయి. వాటిని స్థానికులు గమనించారు. వెంటనే ఇజ్రాయిల్ ప్రాంతంలో ఉన్న రమేష్ తమ్ముడు కేదారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో అతడు అక్కడే ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రమేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. రీ పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.